దేశంలో దొంగ నోట్ల బెడద పెరిగిపోయింది
Published on: Sun May 29, 2022 5:35PM
పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గొప్పగా నల్లధనం వెలికితీతకు, దొంగనోట్లను అరికట్డానికి డిమానిటైజేషన్ అని ప్రకటించారు. అలాగే ఉగ్రవాదులకు నిధులు అంద కుండా చేయడానికి కూడా డిమానిటైజేషన్ దోహదపడుతుందని చెప్పుకున్నారు.
అయితే నాడు ఆయన చెప్పిన మాటలన్నీ ఉత్తి నీటి మూటలేనని నేడు తేలిపోయింది. దేశంలో దొంగనోట్లు ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకటించేసింది. తాజాగా విడుదలైన ఆర్బీఐ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దొంగడనోట్ల చెలామణి విపరీతంగా పెరిగిందని పేర్కొంది. రూ.500 నోట్ల కు సంబంధించి 101.9 శాతం దొంగనోట్లు పెరిగాయనీ, అదే 2000 రూపాయల నోట్లకు సంబంధించి 54.1శాతం మేర దొంగనోట్లు పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.
ఏడాదికేడాది దొంగనోట్ల చెలామణి పెరిగిపోతోందని ఆ నివేదిక వెల్లడించింది. దొంగనోట్ల చెలామణిని అరికట్టలేనప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసిన విధంగా, సామాన్యులు నగదు దొరక్క అల్లాడిపోయేలా, చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను మూసేపుకునేలా చేసిన నోట్ల రద్దు కార్యక్రమాన్ని నాడు మోడీ ఎందుకు చేపట్టారన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్యుల నుంచి వస్తున్నాయి.
అలాగే నోట్ల మార్పిడి తరువాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు అప్పట్లో కేంద్రం ఘనంగా పేర్కొంది. అయితే వాస్తవంలో దేశంలో ఉగ్ర హింస పెచ్చరిల్లిందని రోజూ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడులే నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఆర్బీఐ తాజా నివేదికతో మోడీ డిమానిటైజేషన్ కొండనైతే తవ్వింది కానీ ఎలుకలు కూడా పట్టలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


