వదంతులు, ఊహాగానాలు నమ్మకండి.

“దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నాట్ట” ఈ సామెత ఇప్పుడు మన దేశంలో అక్షరాలా నిజమవుతోంది. ఒక వైపు కరోనా రోజు రోజుకూ జడలు విప్పుతుంటే, అదే స్థాయిలో వదంతులు, ఊహాగానాలు కూడా పురి విప్పుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఏం చెయ్యాలి అన్న సూచనల కంటే పనికిరాని అంశాలు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి.

అలాంటి మెసేజ్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరిట ఒక సందేశం సామాజిక మాద్యమాల్లో విపరీతంగా  తిరుగుతోంది. లాక్ డౌన్ ను నాలుగు దశలుగా విభాజించారని.. మొదటి దశలో ఒక రోజు, రెండో దశలో 21 రోజులు లాక్ డౌన్..5 రోజుల విరామం ఇచ్చి, మూడో దశలో మళ్ళీ 28 రోజుల లాక్ డౌన్ ఉంటుందని..మరలా 5 రోజుల విరామం ఇస్తారనీ, నాలుగో దశలో తిరిగి 15 రోజుల లాక్ డౌన్ ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ క్రమాన్ని తేదీలతో సహా ఉదహరిస్తున్నారు.

ప్రజలకు తెలుగు వన్ న్యూస్ ఒక్క విన్నపం..ఇలాంటి ప్రచారాలను నమ్మకండి. ఎందుకంటే అసలు లాక్ డౌన్ అమలు చేస్తున్నదే ప్రజలు సామాజిక, భౌతిక దూరం పాటించి కరోనా చైన్ తెగ కొడదామని. ఈ సందేశంలో చెప్పిన విధంగా మద్యలో 5 రోజుల విరామం ఇచ్చి దశల వారిగా లాక్ డౌన్ అమలు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇలాంటి ఊహాగానాలు వ్యాప్తి చేసేవారికే తెలియాలి.
 
లాక్ డౌన్ అమలు గురించి విధి విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటిస్తాయి. ప్రజలెవరూ ఇలాంటి ఊహా గానాల ఉచ్చులో పడి ఆవేదన చెందకండి.