కిషన్‌రెడ్డి అనే నేను.. కరుడుగట్టిన కాషాయవాది.. కార్యకర్త నుంచి కేబినెట్‌కు...
Published on: Wed Jul 7, 2021 8:19PM
జి.కిషన్‌రెడ్డి అనే నేను.. అంటూ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఈ తెలుగువాడు. కిషన్‌రెడ్డి ప్రస్థానం రాజకీయంగా అనేకమందికి ఆదర్శప్రాయం. సామాన్య కార్యకర్త.. కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం కొందరికే సాధ్యం. ఓపిక, పట్టుదల, కృషితో అంతెత్తుకు ఎదిగారాయన. సౌమ్యుడు, వివాద రహితుడు, అంతకుమించి పార్టీకి విధేయుడు. ఈ అర్హతలతోనే మోదీని మెప్పించారు. కేంద్రమంత్రిగా ప్రమోషన్ సాధించారు.
సింప్లిసిటీకి కేరాఫ్ కిషన్‌రెడ్డి. ప్రతీఒక్కరితోనూ కలిసిపోతారు. ప్రతీఒక్కరినీ గౌరవిస్తారు. తాను కేంద్ర మంత్రిననే బిల్డప్ ఆయనలో అసలేమాత్రం కనిపించదు. ఇప్పటికీ సామాన్యుడిగానే ఉంటారు. అంబర్‌పేట అడ్డాగా.. రాజకీయంగా ఎదిగారు కిషన్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. నాలుగోసారి ఓడిపోవడం ఆయనకు ఈ విధంగా కలిసొచ్చినట్టుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఓడి.. ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. ఫలితాలు వచ్చిన మరుసటిరోజే.. స్థానిక గల్లీల్లో పర్యటించి.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం.. కిషన్‌రెడ్డి రాజకీయ పరిణితికి నిదర్శనం. ప్రజలకు అందుబాటులో ఉండే ఆ లక్షణమే.. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో ఓడినా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. అదే అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 45 వేల మెజార్టీ సాధించి తన పట్టు నిరూపించుకున్నారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో, కరోనా కల్లోలంలో స్థానికంగా నేనున్నానంటూ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.

గంగాపురం కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో 1960లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రెండేళ్లు పనిచేశారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయీ ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్‌రెడ్డి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్‌పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. 2018లో అంబర్‌పేటలో ఓడి.. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా.. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్నత స్థానానికి చేరారు కిషన్‌రెడ్డి. రాజకీయాల్లో మోదీ, కిషన్‌రెడ్డిలు సహ కార్యకర్తలు.. యువమోర్చాలో ఉన్నప్పుడు మోదీ, కిషన్‌రెడ్డిలు కలిసి పని చేశారు. ఇప్పుడు కేంద్రంలోనూ ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి హోదాలో పని చేస్తున్నారు కిషన్‌రెడ్డి.



