జగన్-చిరు భేటీలో సైరాను మించిన డిస్కషన్స్... మెగా ఫ్యామిలీ కేంద్రంగా టాలీవుడ్ పై వైసీపీ వ్యూహం

 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి మీటింగ్ తర్వాత టాలీవుడ్ లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్-చిరు భేటీలో కేవలం సైరా గురించే మాట్లాడుకోలేదని, తాజా రాజకీయ పరిణామాలు, టాలీవుడ్ లో పరిస్థితులపై చర్చ జరిగిందని అంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో ఉందని, అందుకే తాను ముఖ్యమంత్రి అయినా అభినందించడానికి టాలీవుడ్ ప్రముఖులు అభినందించడానికి రాలేదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా, సినీ పరిశ్రమ నుంచి తనను కలిసిన మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ పరిస్థితుల గురించి జగన్ క్షుణ్ణంగా చర్చించారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు టార్గెట్ గా, టాలీవుడ్ లో ఆ సామాజికవర్గ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనకు జగన్ వచ్చారని చెబుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న చంద్రబాబు సామాజికవర్గం ప్రముఖులకు చెక్ పెట్టడమే కాకుండా, ఆ వర్గం డామినేషన్ లేకుండా, వాళ్లను నిమిత్తమాత్రులుగా చేయాలనే వ్యూహాన్ని మెగాస్టార్ చిరంజీవి కేంద్రంగా చేయాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని, సినీ పరిశ్రమను దారిలోకి తెచ్చుకోవాలనేది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. అందుకే, ఇకపై టాలీవుడ్ కి సంబంధించిన ఏ పనైనా చిరంజీవి సిఫార్సుతోనే చేసేలా ప్రభుత్వ వర్గాలకు సంకేతాలు పంపారట. ఓవరాల్ గా తెలుగు ఇండస్ట్రీని జగన్ తరపున మెగా కుటుంబం లీడ్ చేసేలా వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి-మెగాస్టార్ చిరంజీవి సమావేశంలో... సైరాను మించిన డిస్కషన్స్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.