TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్ర‌బాబు ‘పెగాసస్‌’ కొన్నారా? ఏది నిజం? ఏది అబ‌ద్ధం?

Published on: Fri Mar 18, 2022 4:50PM

భారతదేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ ను కూడా తాకింది. గతంలో పెగాసస్ వ్యవహారంతో పార్లమెంట్‌ ఉభయ సభలు స్తంభించిపోయాయి. అయితే.. ఈ పెగాసస్‌ స్పైవేర్‌ పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఓ ప్రకటన సంచలనం రేపుతోంది. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెగాసస్‌ స్పైవేర్‌ ను కొనుగోలు చేసిందని ఆమె ఓ సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే.. టీడీపీ హయాంలో వివాదాస్పద పెగాసస్‌ సాఫ్ట్‌ వేర్‌ ను కొనుగోలు చేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఖండించారు. పెగాసస్ స్పైవేర్‌ ను కొనాలని డెవలపర్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారని అయితే.. తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన వివరణ కూడా ఇచ్చారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్‌ వేర్ ను కొని, అప్పటి విపక్ష నేతలపై నిఘా పెట్టి ఉంటే జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉండేవారే కాదని అన్నారు. చంద్రబాబు హయాంలో పెగాసస్‌ సాఫ్ట్ వేర్ కొని ఉంటే.. ఈ మూడేళ్లలో జగన్‌ రెడ్డి సర్కార్‌ దానిని బయటపెట్టకుండా ఉంటుందా? మాపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తుందా? అనేది లోకేష్‌ చెబుతున్న లాజిక్‌.

ఈ వివాదాస్పద పెగాసస్‌ స్పైవేర్‌ సాఫ్ట్‌ వేర్‌ ను 25 కోట్ల రూపాయలకు ఇస్తామంటూ అప్పట్లో బెంగాల్‌ లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయని మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే.. ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధం కనుక తాము కొనలేదని చెప్పారు. ఈ స్పైవేర్‌ ను కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం దానిని దేశ భద్రత కోసం వినియోగించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేతలు, ఇతర అధికారులపై నిఘా కోసం వాడిందని మమతా బెనర్జీ ఆరోపించారు. నిజానికి భారత ప్రభుత్వం 2017లో పెగాసస్ సాఫ్ట్ వేర్‌ ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ లో వచ్చిన కథనం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్ స్పైవేర్‌ కోసం కూడా భారతదేశం డీల్ కుదుర్చుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్ కథనం పేర్కొంది.

ఇజ్రాయెల్‌ కు చెందిన ఎన్ఎస్‌ఓ సంస్థ పెగాసస్‌ సాఫ్ట్‌ వేర్‌ను డెవలప్ చేసింది. స్ఫియర్‌- ఫిషింగ్‌ పద్ధతులు వినియోగించి, టెక్స్ట్‌ లింకులు, మెసేజ్‌ క్లిక్స్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలోకి పెగాసస్ స్పైవేర్‌ చొచ్చుకుపోయే స్థాయి నుంచి ‘జీలో క్లిక్‌’ అటాక్స్‌ ప్రయోగించే స్థాయికి పెగాసస్ స్పైవేర్‌ ఎదిగింది. ఈ స్పైవేర్‌ మొబైల్‌ వినియోగదారులను వణికిస్తోంది. పెగాసస్ స్పైవేర్‌ అత్యంత శక్తివంతమైనదని టెక్ నిపుణులు అభివర్ణిస్తుండడం విశేషం. ఫోన్‌ వినియోగదారుడు ఎలాంటి లింకును ఓపెన్ చేయకపోయినా, అసలు మొబైల్ వినియోగదారుడి ప్రమేయం లేకపోయినా కూడా పెగాసస్‌ స్పైవేర్‌ మొబైల్‌ ని హ్యాక్‌ చేసిపారేస్తుంది. పెగాసస్‌ స్పైవేర్‌ ఒక్కసారి మొబైల్ ఫోన్‌ లోకి చొరబడితే.. మొబైల్ యజమాని కన్నా స్పైవేర్‌ ఎక్కువ కంట్రోల్‌ కలిగి ఉంటుందని ప్రముఖ ‌హ్యాకర్‌, సెక్యూరిటీ పరిశోధకుడు, మాల్ వేర్‌ విశ్లేషకుడు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆధారిత సెక్యూరిటీ ల్యాబ్‌ నిర్వహిస్తున్న క్లాడియో గౌర్నియరీ హెచ్చరించడం గమనించదగ్గ విషయం. ఇక ఐ ఫోన్‌ లోకి కనుక పెగాసస్‌ స్పైవేర్‌ చొరబడినట్లయితే.. క్షణాల్లోనే మొబైల్ లోని కీలకమైన అధికారాలను స్వాధీనం చేసుకుంటుందని ఆయన వెల్లడించడం గమనార్హం. ఆ తరువాత స్పైవేర్‌ మొబైల్‌ లోని కాంటాక్ట్‌ లిస్టును, మేసేజ్‌లు, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చరిత్ర లాంటి అన్ని విషయాలను అది యాక్సెస్‌ చేసుకుంటుందట. అలా యాక్సెస్ చేసుకున్న విషయాలన్నింటినీ హ్యాకర్‌ కి పెగాసస్‌ స్పైవేర్ చేరవేస్తుందట.

కాగా.. పెగాసస్‌ స్పైవేర్‌ సైబర్‌ దాడిని గుర్తించడం కూడా కష్టమేనట. అలాంటప్పుడు దాన్ని నిరోధించడం అనేది దాదాపు అసాధ్యం అంటున్నారు సైబర్ నిపుణులు. మొబైల్ వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్యాచ్‌ లను అప్డేట్‌ చేసుకుంటే కొంతమేర పెగాసస్ స్పైవేర్‌ దాడిని కట్టడిచేసుకునే వీలుందని చెబుతున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే అప్లికేషన్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

న్యూయార్క్‌ టైమ్స్‌ లో వచ్చిన కథనం ఆధారంగా పెగాసస్‌ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఇది ముమ్మాటికీ ద్రోహమే అని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారు. దేశానికి శత్రువులా మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జుక ఖర్గే ఫైరయ్యారు. పెగాసస్ స్పైవేర్‌ ను ప్రతిపక్షలు, జర్నలిస్టులపై నిఘా పెట్టేందుకు ఉపయోగించారని, దేశాన్ని బిగ్‌ బాస్ షోగా బీజేపీ మార్చిందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించడం విశేషం.

తాజాగా పశ్చిబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన మాటలతో ఆంధ్రప్రదేశ్‌ లో పెగాసస్‌ స్పైవేర్ వ్యవహారం ఎలాంటి సంచలనం రేపనున్నదో మరి!