ఫేస్‌బుక్ స్నేహితులే ఆమెను కిడ్నాప్ చేశారు
Published on: Tue Feb 16, 2016 3:19PM
.jpg)
ముక్కూ మొహం తెలియని వారిని ఫేస్‌బుక్‌లో స్నేహితులుగా అనుమతించేయడం, వారితో అతి చనువుని పెంచుకోవడం ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేందుకు మరో సంఘటన జరిగింది. గోవాకి చెందిన ఒక 16 ఏళ్ల అమ్మాయికి ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. నేరుగా నిన్ను చూడాలని ఉందంటూ ఓ చోటకి రమ్మన్నారు. తీరా అక్కడికి చేరుకున్న అమ్మాయిని ఒక తెల్లకారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. కాలేజీకని వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ కేసుని అన్ని కోణాలలోంచి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన పోలీసులకు ఎందుకనో ఆమె ఫేస్‌బుక్ మీద కూడా అనుమానం వచ్చింది. వెంటనే ఆమె ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితుల ఫోటోలన్నీ ప్రింట్ అవుట్ తీసుకున్నారు. బాధితురాలిని చివరిసారిగా చూశామని చెబుతున్నవారికి సదరు ఫొటోలు చూపించడంతో నేరస్తుల గుట్టు రట్టయింది. కిడ్నాప్ అయిన కొన్ని గంటల తరువాత నిందితుల కారును పోలీసులు పట్టుకోగలిగారు. ఆ సమయంలో బాలిక కూడా వారితోనే ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారులో ఆమె మీద ఏదన్నా అఘాయిత్యానికి ఒడిగట్టారా అని ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఫేస్‌బుక్ స్నేహాల ఖాతాలో మరో ఘోరం నమోదైంది.


