ఫేస్‌బుక్‌ సృష్టికర్త ఆస్తి 2 లక్షల కోట్లు!!

 

ఇది మీరు కచ్చితంగా షేర్ చేయాల్సిన లేదా లైక్ చేయాల్సిన లేదా కామెంట్ చేయాల్సిన మేటర్. ఎందుకంటే ఇది ఫేస్‌బుక్‌ సృష్టికర్త, ఆ కంపెనీ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్‌కి సంబంధించిన తాజా వార్త. ఆ వార్త ఏమిటంటే, జుకర్‌ బర్గ్ ఆస్తి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. (3,300 కోట్ల డాలర్లు). ఫేస్‌బుక్ కంపెనీ షేర్ల విలువ గురువారం బాగా పెరిగిపోయి కొత్త గరిష్ట స్థాయిని చేరడంతో జుకర్ బర్గ్ ఆస్తి కూడా 160 కోట్ల డాలర్లకు పైగా పెరిగి ప్రస్తుతం వున్న స్థాయికి చేరింది. మార్క్ ఆస్తి మరో రెండు మూడు రోజుల్లో మూడువేల ఐదువందల కోట్లకు అంటే అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్క్ ఆస్తి విషయంలో జుకర్ బర్గ్ గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్, అమెజాన్ డాట్‌కామ్ సిఇఓ జెఫ్ బెజోస్‌ని మించిపోయాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో 30 ఏళ్ళ జుకర్ బర్గ్ 16వ స్థానంలో నిల్చారు. గూగుల్ వ్యవస్థాపకులు వరుసగా 17,18 స్థానాల్లో ఉండగా.. బెజోస్ 20వ ర్యాంకులో ఉన్నారు. 8,470 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఫేస్ బుక్ వినియోగదారులుగా మనం మార్క్ జుకర్ బర్గ్ మరింత ధనవంతుడు అవ్వాలని కోరుకుందాం.