ఉన్నవాడో లేనివాడో... మొహం చూస్తే తెలిసిపోతుంది

‘Face is the index of the mind’ అంటూ ఉంటారు పెద్దలు. మన మొహం చూస్తే, మనసులో ఏముందో చెప్పేయవచ్చన్నది వారి భావన. కానీ ఒకరి మొహం చూసీచూడగానే... ఇతను ఉన్నవాడనో, లేనివాడనో చెప్పేయవచ్చా! మొహంలో ఎలాంటి భావనా కనిపించకపోయినా, అతని అంతస్తుని పసిగట్టవచ్చా! అంటే భేషుగ్గా అంటున్నారు పరిశోధకులు. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు... మొహాన్ని చూసి మనిషి ఆస్తిపరుడా, కాదా అన్న విషయాన్ని ఎంతవరకు పసిగడతామో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 60వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ, లక్షకు పైగా డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ ఫొటోలు తీశారు. ఈ ఫొటో తీసే సమయంలో వారి మొహంలో చిరునవ్వూ, బాధా, కోపం లాంటి ఏ భావమూ లేకుండా ఉండేట్లు జాగ్రత్తపడ్డారు.

 

పరిశోధకులు తాము తీసిన ఫొటోలని కొందరు వాలంటీర్లకు చూపించారు. విచిత్రంగా సగానికి పైగా సందర్భాలలోనే అవతలి మనిషి పేదా, గొప్పా అన్న విషయాన్ని ఇట్టే పసిగట్టేశారట. ఎదుట ఉన్నది ఆడామగా, తెల్లవాడా నల్లవాడా అన్న బేధాలేవీ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు. చూసీ చూడగానే ఠక్కున ఫొటోలోని వ్యక్తి ఆర్థిక పరిస్థితిని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా... ఇదంతా కూడా మన మెదడుకి ఉన్న సామర్థ్యమే అంటున్నారు. మొహాలని పసిగట్టడంలో మన మెదడు మహా దిట్ట అట. ఆఖరికి మబ్బులని చూసినా కూడా, వాటిని ఏదో ఒక మొహంతో పోల్చుకోగలదు. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా, విరక్తిగా ఉన్నారా అన్నది కూడా దానికి తెలిసిపోతుంటుంది. అదే సూత్రంతో వాళ్లు పేదా గొప్పా అన్నది అంచనా వేసేస్తుంది.

 

అనారోగ్యం, కుటుంబ కష్టాలు దీర్ఘకాలం ఉండకపోవచ్చు. కానీ పేదరికంలో పుట్టినవారు దాని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఆ పేదరికం కలిగించే అసంతృప్తి, బాధ వారిని వేధిస్తుంది. ఒక మనిషి సుదీర్ఘకాలం సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా... కొన్నాళ్లకి ఆ భావం అతని మొహం మీద స్థిరపడిపోతుందట! అంటే ఓ వయసు వచ్చిన తర్వాత మనం ఏ భావమూ లేకుండా ఉన్నా కూడా, మన పరిస్థితి అన్నది అవతలి మనిషికి తెలిసిపోతుందన్నమాట!

 

మన ఆర్థిక పరిస్థితి అవతలివారికి తెలియడం వల్ల నష్టం ఏమిటి? అన్న అనుమానం రావచ్చుగాక! ఏ ఉద్యోగానికో, పెళ్లిచూపులకో, అప్పు కోసమో వెళ్లినప్పుడు... సహజంగానే అవతలి వ్యక్తికి మన మీద తెలియకుండానే ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన పేదరికం మరింత శాపంగా పరిగణిస్తుంది. పరిశోధకులు దీనికి నివారణోపాయాన్ని చెప్పలేదు కానీ... జీవితంలో ఎలాంటి సమస్యనయినా చిరునవ్వుతో ఎదిరించే ధైర్యం, ఉన్నదానిలో తృప్తిగా ఉండే తత్వం ఉంటే మన మొహంలో ఎలాంటి పేదరికమూ కనిపించకపోవచ్చు.

- నిర్జర.