TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జలవిహార్‌లో పేలుడు…ముగ్గురికి గాయాలు

Published on: Wed Apr 8, 2026 8:06PM

 

హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్లాంట్ పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం భారీగా వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.

పేలుడు సమయంలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన అప్పుల నాయుడు, అంజిలను అత్యవసరంగా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి లక్ష్మణ్‌ను సోమాజిగూడలోని జాయ్ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్‌తో పాటు లేక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమికంగా ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్‌లో అధిక ఒత్తిడి (ప్రెషర్) ఏర్పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో జలవిహార్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.