TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఊపిరితిత్తుల వరకు చేరని వైరస్.. ఒమిక్రాన్ తో నో డేంజర్ 

Published on: Mon Jan 3, 2022 9:36AM

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కమ్మేసింది. యూపర్ దేశాలతో పాటు యూఎస్ఏను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 10 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు వారాల క్రితం వరకు డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువుండగా.. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలోనూ ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతూ భయపెడుతోంది. ఆదివారం దేశంలో  33 వేల 759 కొత్త కేసులు వచ్చినట్లు వైద్య శాఖ వెల్లడించింది. గత సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. రానున్న రోజుల్లో దేశంలో కొవిడ్ కేసులు ప్రమాదకరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ప్యూ అమలవుతోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. 

ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో డెల్టా వేరియంట్‌‌లానే ఇది కూడా విరుచుకుపడి ప్రాణాలను హరిస్తుందా? దీని వల్ల పెను విపత్తు సంభవించబోతోందా? అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ వేరియంట్ చాలా డేంజరని కొందరంటుంటే, భయపడాల్సింది ఏమీ లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా ఈ వేరియంట్‌పై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన ఫలితాలు ఊరటనిస్తున్నాయి. కరోనాలోని గత వేరియంట్లతో పోలిస్తే ఇది ఏమంత ప్రమాదకారి కాదని అధ్యయన నివేదిక చెబుతోంది. ఒమిక్రాన్ అంటే భయపడాల్సిందేమీ లేదని వెల్లడించింది.

గతంలోని కరోనా వైరస్‌లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపించి ఊపిరాడనివ్వకుండా చేసి ప్రాణాలు హరించాయి. అయితే, ఒమిక్రాన్ వల్ల మాత్రం అలాంటి ప్రమాదమేమీ లేదన్న విషయం తాజాగా వెలుగుచూసింది. ఇది శరీరంలోని పైభాగానికే పరిమితమవుతున్నట్టు గుర్తించారు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, శ్వాసనాళానికే పరిమితమవుతోందని, ఊపిరితిత్తుల వరకు చేరుకోవడం లేదని ఎలుకలు, చిట్టెలుకలపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతోందని బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కంప్యుటేషనల్ బయాలజిస్ట్ రోనాల్డ్ ఈల్స్ తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థకు కరోనా వైరస్‌లు ఎలా సంక్రమిస్తాయన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.

అయితే గత పరిశోధనల ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. కరోనా వైరస్‌లు కణాలను గట్టిగా పట్టుకుంటాయని, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నుంచి కూడా అవి తప్పించుకోగలవని తేల్చాయి. అయితే, ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశించాక లోపల ఎలా ప్రవర్తిస్తాయన్నది అంతుబట్టకుండా ఉండిపోయింది. తాజా పరిశోధన ఫలితాలు మాత్రం ఒమిక్రాన్ వల్ల ఏమంత భయం లేదని, ఆందోళన చెందాల్సిన పని అసలే లేదని తేల్చింది. ఒమిక్రాన్ సోకినప్పటికీ ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి త్వరగానే దాని బారి నుంచి బయటపడొచ్చని పేర్కొంది. ఒమిక్రాన్ భూతంలా భయపెడుతున్న వేళ తాజా అధ్యయన ఫలితాలు పెద్ద ఊరటే.