TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అభిమానుల కోరిక మేరకే జగన్ పార్టీలోకి :సంతోష్‌రెడ్డి

Published on: Mon Jan 9, 2012 2:52PM

హైదరాబాద్: మాజీ మంత్రి సంతోష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. రేపు ఆర్మూరు సభలో అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రోజులపాటు దీక్షలో పాల్గొని విజయవంతం అయ్యేందుకు కృషిచేస్తానని తెలిపారు. నిజామాబాద్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో జగన్‌ దీక్ష జరుగుతుందని ఆయన వివరించారు. తన అభిమానుల కోరిక మేరకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు సంతోష్‌రెడ్డి తెలిపారు.

కాగా కొత్తగా పార్టీ స్థాపించడం  తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తానని చెప్పడం కారణంగా ఇటీవల జగన్‌పై తెలంగాణలో కొంత వ్యతిరేకత తగ్గింది. ఆదే సమయంలో ఆయన సంతోష్ రెడ్డి సొంత జిల్లా అయిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పర్యటిస్తున్నారు.  మొదటి నుండి పక్కా తెలంగాణవాది అయిన సంతోష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకే జగన్‌ను కలిసి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2004కు ముందు తెలంగాణ ప్రాంతం నుండి కాంగ్రెసులో కీలక నేతగా ఉన్న సంతోష్ రెడ్డి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ పార్టీ నుండి 2004లో పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో విభేదాలు వచ్చి తిరిగి కాంగ్రెసులో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ స్వగృహ వల్ల పదిమంది తెలంగాణ ఎమ్మెల్యేలు కాంగ్రెసులో చేరారు. అందులో సంతోష్ రెడ్డి ఒకరు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసులో చేరినప్పటికీ క్రియాశీలకంగా లేరనే చెప్పవచ్చు.అయితే  కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోక పోవడం, తెలంగాణ ప్రాంతంలో తాను విభేదించి బయటకు వచ్చిన కెసిఆర్‌కు చెందిన పార్టీ హవా కొనసాగుతుండటం, జగన్ తెలంగాణకు సానుకూలంగా మాట్లాడటం వంటి కారణాల దృష్ట్యా వైయస్సార్ పార్టీలో చేరడమే ఉత్తమంగా సంతోష్ రెడ్డి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.