ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అంటున్న మోడీ పార్టనర్

 

తమిళనాట స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి స్వీప్ చేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సంగతి తెలిసిందే. తమిళనాడులో మొత్తం 39 పార్లమెంటు స్థానాలు ఉండగా.. భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో వేలూరు నియోజకర్గంలో పోలింగ్ ను ఈసీ ఆపేసింది. మిగిలిన 38 సీట్లలో డీఎంకేకు 34 నుంచి 38 సీట్లు వస్తాయని వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 0-4 వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని ఆయన అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నాడీఎంకే కూటమి మొత్తం 39 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన ఇక్కడో లాజిక్ మిస్ అయ్యారు. కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అన్ని  ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. తమిళ నాడులో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి తక్కువ సీట్లు వస్తాయని చెప్పడంతో ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని పళనిస్వామి అంటున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ అబద్దమైతే కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే అధికారంలోకి రావడం కూడా అబద్ధమేనా?? పాపం పళనిస్వామి ఆయన రాష్ట్రంలో ఆయన పార్టీ ఓడిపోతుందన్న బాధలో ఏకంగా ఎగ్జిట్ పోల్స్ అబద్దమని తేల్చేసారు.