TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హద్దులు దాటిన పొగడ్తలు.. ఎబ్బెట్టుగా మారిన ప్రసంగాలు.!

Published on: Mon Aug 3, 2026 10:12AM

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆగస్టు 1, 2026  సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల  సాకారమైన రోజది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైన దినమది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర రూపురేకలు మారిపోతాయని, విమానయాన అనుసంధానత పెరగడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పర్యాటకం, వేలాది కొత్త ఉద్యోగ,ఉపాధి అవకాశాలు  అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది.

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద మౌలిక వసతుల పురోగతిలో భోగాపురం విమానాశ్రయం ప్రధానమైనదనడంలో  ఇసుమంతైనా సందేహానికి తావులేదు.  అయితే..  ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికపై నుంచి సాగిన ప్రసంగాలు..  ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీలు పడి మరీ కురిపించిన   ప్రశంసలు  వర్షం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు..  జాతీయ స్థాయిలోనూ చర్చకు దారి తీశాయి.  

సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు,   సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో  దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్  ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  ప్రధాని నరేంద్ర మోదీ     దేశానికి అందిస్తున్న సేవను కొనియాడుతూ, సభకు హాజరైన వేలాది మంది ప్రజలచేత మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కోరడం ఏ సందేశం ఇస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అభివృద్ధి ప్రాజెక్టుల కంటే మోదీ వ్యక్తి పూజకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన భావోద్వేగ ప్రసంగంలో మోడీ వ్యక్తి పూజ ఆకాశమే హద్దుగా సాగిందన్న విమర్శలూ వినవస్తున్నాయి.  

జాతీయ స్థాయిలో  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, రైతులు ఆందోళన బాట పట్టిన సమయంలో..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించడం ఒకింత ఎబ్బెట్టుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశంసలైనా, విమర్శలైనా సమతుల్యత పాటించినప్పుడే రాణిస్తాయని అంటున్నారు.   భోగాపురం విమానాశ్రయం వంటి చారిత్రాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి లభించే   ఆర్థిక ఉద్దీపన, ఉత్తరాంధ్ర ప్రగతి ప్రాధాన్యతను వివరించి, అందుకు సహకరించిన ప్రధానిని ప్రశంసించి, కృతజ్ణతలు తెలపడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, రాజును మించి రాజభక్తి అన్నట్లుగా.. మోడీని ప్రశంసించడం కోసమే  ఆ సభ అన్నట్లుగా పోటీలు పడి మరీ ప్రసంగించడం.. ప్రజలను సైతం విస్మయపరిచింది.

ఆంధ్రప్రదేశ్ లో జనం కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినా.. రాష్ట్రం వరకూ ప్రధాన పార్టీ తెలుగుదేశం, ఆ తరువాత జనసేనలు ఉంటే.. రాష్ట్రంలో బీజేపీ ఉనికిమాత్రంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే భోగాపురం సభ వేదికగా పవన్, చంద్రబాబు ప్రసంగాలు.. పొలిటికల్ గా  వారి వారి పార్టీలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాబలంతో తాము గెలిచినా.. మోడీ ప్రాపకం లేకుంటే.. తాము చేయగలిగింది శూన్యం అని చెప్పుకున్నట్లుగా ఉందని అంటున్నారు.  భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభ మోడీకి పంచరత్నాలు చదవడానికే ఏర్పాటు చేశారా అన్న అనుమానం కలిగేలా సాగిందన్న అభిప్రాయం జనబాహుల్యంలో బలంగా వ్యక్తమౌతోంది.  

Bhogapuram Airport, Narendra Modi, Chandrababu Naidu, Pawan Kalyan, AP Politics, Uttarandhra Development