టీడీపీకి మరో గట్టి దెబ్బ.. బీజేపీలోకి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి!

 

ఏపీలో టీడీపీకి బీజేపీ వరుస షాకులు ఇచ్చేలా ఉంది. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీకి గట్టి షాక్ తగలనుందని తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశముందట. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీ చేరి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 

ఆదినారాయణరెడ్డి సోమవారం హైదరాబాద్ లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డాతో సమావేశం అయ్యారని కూడా తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యతో కలసి ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డి నేరుగా బీజేపీ తెలంగాణ కార్యాలయానికే వెళ్లడంతో ఇక ఆయన పార్టీ మారటం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. అనంతరం మంత్రి పదవి పొందారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించిన ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. ఆయనను కాదని జమ్మలమడుగు టిక్కెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆదినారాయణరెడ్డి అయిష్టంగానే ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయిన ఆదినారాయణ రెడ్డి.. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన చేరిక ఖరారైనట్లు తెలుస్తోంది.