రక్తం 'వరద'లా పారిస్తున్న మాజీ ఎమ్మెల్యే ?
Published on: Fri Mar 9, 2012 11:28AM
ఆ రాజుగారికి 18 తుపాకీ లైసెన్స్ లు
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
హైదరాబాద్: ఆ
యన మాజీ ఎమ్మెల్యే . కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దందాలు, సెటిల్ మెంట్లు చేస్తుంటారు . అడ్డువచ్చిన వారి ప్రాణాలుతీసి రక్తాన్ని వరదలా పారిస్తుంటారు. ఈ 'రాజుల రెడ్డి' గారికి తన ప్రాణాలకంటే ఎంతోప్రీతి. తన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవటానికి 18 తుపాకులకు లైసెన్స్ లు తీసుకుని ఉంచుకున్నారు. అయితే తన ప్రాణరక్షణకోసం ఈ తుపాకులు తీసుకున్నానని ఆయన చెబుతున్నప్పటికీ వాటితోనే ఇతరుల ప్రాణాలను హరిస్తుంటారని ఆయనంటే గిట్టనివారు ఆరోపణ చేస్తూ ఉంటారు. ఆయన డబ్బుకోసం ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఎన్నో ఏళ్ళుగా తనను నమ్ముకున్నవారు కూడా తనకు ద్రోహం చేశారని అనుమానం వస్తే వాళ్ళను సఫా చేస్తుంటారు. ఇటీవల రూ.30 కోట్ల విలువచేసే భూమిని సొంత చేసుకునేందుకు చక్రపాణి అనే ఒక ఆడిటర్ ను హత్యచేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. తాను చెప్పిన వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వకపోతే ఆయనకు ఆగ్రహం వస్తుంది. మందీ మార్భలంతో కత్తులు, కటార్లతో బ్యాంకు కార్యాలయాలపై దాడి చేసి సిబ్బందిని బైటకు ఈడ్చి వాటికి తాళాలు వేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. మూడు దశాబ్దాలపాటు ఆయనకు అండదండగా నిల్చిన సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనకు తోక జాడించాడనే అనుమానంతో ఆ తోకనేకాక అతని పీకను కూడా ఈయన కత్తిరించాడు. శత్రుశేషం మిగల్చకూడదన్న విదుర నీతిని వంటబట్టించుకున్న ఈ రాజుల రెడ్డిగారు ఆయన కుమారుడిని సైతం పరలోకానికి పంపారు. మాలేపాడుకు చెందిన ఒక మాజీ సర్పంచ్ హత్యకేసులోనూ, మరో ముగ్గురు అమాయకుల హత్యకేసులోనూ ఈయన గారికి ప్రమేయం ఉన్నట్లు ప్రత్యర్ధులు అంటున్నారు. ఇతని ఆగడాలు పోలీసులకు తెలిసినప్పటికీ వారెవరూ ఈయన ఇంటివైపు కన్నెత్తి చూడటానికి సాహసించరు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ మద్దతుతో చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ప్రాంత నేతలను కూడా వదలడం లేదు. వారిని కూడా నిత్యం బెదిరింపులతో విసిగిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయాన జగన్ కి చెప్పినప్పటికీ ఆయన కూడా ఈ రాజుల రెడ్డిగారిని ఏమీ చేయలేకపోతున్నాడు.


