TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాకాణిపై అనిల్ సెటైర్‌.. తాజా మంత్రులపై మాజీల మంట‌!

Published on: Tue Apr 12, 2022 4:05PM

‘తాంబూలాలు ఇచ్చేశాను.. తన్నుకు చావండి’ అన్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తన 2.O కేబినెట్ ను సోమవారం ఏర్పాటు చేశారు. మొదటి మూడేళ్లు మంత్రి పదవులు అనుభవించిన పలువురు తమ పదవీకాలం కొనసాగింపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అలాగే.. కొత్త కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టాలని కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. పాత మంత్రుల్లో 11 మందికి, కొత్తగా 14 మందికి సీఎం జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. ముందుగా చెప్పినట్లు 90 శాతం మంది పాతవారిని తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించి ఉంటే పెద్దగా నిరసనలు, అలకలు ఉండకపోయేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

మంత్రి పదవి కొనసాగింపును ఆశించిన కొందరు తాజా మాజీ మంత్రులు కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన మంత్రులపై సెటైర్ల రూపంలో తమ అసంతృప్తిని, అక్కసును వెళ్లగక్కుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొత్తగా వ్యవసాయ మంత్రి అయిన అదే జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై సెటైర్ల రూపంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. అనిల్ వ్యాఖ్యలు పైకి సెటైర్లు అనిపించినా.. ఆయన మాటల వెనుక చెప్పలేనంత ఆగ్రహం, ఆవేదన ఉన్నట్లు కనిపిస్తోందంటున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎంత గౌరవం ఇచ్చారో.. ఎంత సహకారం అందించారో, ఎంత మర్యాదగా చూశారో.. అంతకు డబల్ తాను ఇచ్చేస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ అనడం వైరల్ అవుతోంది. నిజానికి అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి గోవర్ధన్ ఏమాత్రం తనకు మర్యాద ఇవ్వలేదని, సహకరించలేదని, గౌరవించలేదనే విషయాన్ని అనిల్ కుమార్ చెప్పక చెప్పారంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గాని, సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గాని తనను తమ తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు ఏనాడూ ఆహ్వానించలేదని చెప్పడం గమనార్హం. అయినప్పటికీ తాను మాత్రం కాకాణిని మంత్రిగా తన నియోజకవర్గానికి తప్పకుండా ఆహ్వానిస్తానని అనడం విశేషం. ఎందుకంటే కాకాణి చేసిన తప్పును తాను చేయబోనని అనిల్ కుమార్ చెబుతున్నారు. అంటే.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పులు చేశారనే భావం అనిల్ కుమార్ యాదవ్ లో బలంగా ఉందనే విషయం స్పష్టం అవుతోందంటున్నారు.

మంత్రి పదవిలో కొనసాగింపు పొందలేకపోయిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అయితే.. బాహాటంగానే జగన్ కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా బుజ్జగించేందుకు తన వద్దకు వచ్చిన మోపిదేవి వెంకట రమణ చేతికే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ పెట్టి పంపించారు. అఫ్ కోర్స్.. సుచరిత తీరుపై సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు. మంత్రివర్గం కూర్పులో రెడ్లకు ఒక న్యాయం, ఎస్సీలకు మరో న్యాయం చేయడం ఏంటంటూ సుచరిత సూటిగా ప్రశ్నించి తన అసహనాన్ని ప్రదర్శించడం గమనార్హం.

తాజా మాజీ మంత్రులైన వారిలో ఇప్పటికి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్ బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజా మంత్రులపై ముందు నుంచీ తమలో గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని బహిర్గతం చేశారు. ఇకపై వీరి దారిలోనే మరి కొందరు తాజా మాజీలు కూడా నడిచే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరో పక్కన మంత్రి పదవులు ఆశించి, భంగపడిన ఎమ్మెల్యేల్లో కూడా అలాంటి ధోరణే కనిపిస్తోందంటున్నారు. ఈ సారి కేబినెట్ లోకి తీసుకున్న వారి కన్నా తాము ఎందులో తక్కువ అని తమను పక్కన పెట్టేశారంటూ కొందరు ఎమ్మెల్యేలు కారాలు, మిరియాలు నూరుతున్నారంటున్నారు. మోనార్క్ జగన్ కు వ్యతిరేకంగా నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోయినా.. తమ అనుచరులతో జరుగుతున్న చర్చల్లో వారు ఇదే విషయాన్ని చెప్పుకుని ఆవేదన చెందుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. మంత్రిగా కొనసాగాలని ఎవరికి ఉండదు? అంటూ అనిల్ కుమార్ యాదవ్ తన మనసులో మాటను బయటపెట్టడం విశేషం.

మరో పక్కన డైరెక్ట్ గా అలకపాన్పు ఎక్కిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వారిని బుజ్జగించేందుకు వైఎస్ జగన్ పార్టీ సీనియర్లను రంగంలోకి దింపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. బాలినేనిని తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని ఏదో పెద్ద మంత్రమే వేసినట్లున్నారు. ఆ మంత్రమేదో బాలినేనిపై పనిచేసినట్లుంది. చల్లబడ్డారు. జగన్ చెప్పినట్లే తాను చేస్తానంటూ మీడియా ముందు చెప్పారు. ఇంకా అలక వీడని సామినేనిని బుజ్జగిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలిపించుకుని సర్దుబాటు మాటలేవో చెప్పారు.

ఇప్పటికైతే సుచరిత, అనిల్ కుమార్ యాదవ్ బయటపడ్డారు. ఇంకా ఎవరెవరు ముందుకు వచ్చి అధిష్టానంపైనా, తాజా మంత్రులపై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతారో అనే ఊహాగానాలు వస్తున్నాయి.