ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లిలోని తన నివాసంలో సుబ్బయ్య తుదిశ్వాస విడిచారు. కొంత కాలం క్రితం ఆయన గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. 

 

పలమనేరులో ప్రభుత్వ డాక్టర్‌గా పని చేసిన సుబ్బయ్య.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు గెలిచారు. టీడీపీ హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. ఆయన పౌరసరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన సాధారణ జీవితం గడిపారు. ఒకప్పుడు మంత్రి హోదాలో ఉన్న సుబ్బయ్య.. అనంతరం స్కూటర్‌ పై తిరిగేవారు. 

 

ప్రస్తుతం సుబ్బయ్య బీజేపీలో ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తున్న తరుణంలో సుబ్బయ్య బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం తిరిగి ఆయన గతేడాది జులైలో బీజేపీలో చేరిపోయారు.