టీడీపీకి మరోదెబ్బ.. వైసీపీలోకి మాజీ మంత్రి నారాయణ!!

 

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరారు. మరికొందరు నేతలు కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి నారాయణ కూడా టీడీపీని వీడటానికి సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. నారాయణ వైసీపీ కండువా కప్పుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారట.

ప్రస్తుతం నారాయణ టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుకి కూడా నారాయణ అందుబాటులోకి రావడంలేదని సమాచారం. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినా, ఎన్నికల కోసం ఎంతో ఖర్చుపెట్టినా.. తమ పార్టీ వాళ్లే తనని మోసం చేసి ఓడించారని నారాయణ బాగా హార్ట్ అయినట్లు తెలుస్తోంది. దానికి తోడు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని వాటిని సీఎం జగన్ బయటకు తీస్తున్నాడనే సమాచారం రావటంతో నారాయణ మరింత డిప్రెషన్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 

మంత్రి కాకముందే నారాయణ విద్య సంస్థల అధినేతగా ఆయనకు రాష్ట్రంలో ఓ గుర్తింపు ఉంది. ఇప్పుడు అవినీతి మరకలు అంటుకుంటే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్న పేరు కూడా పోతుందని భయపడుతున్నారట. అందుకే ఇప్పుడు వైసీపీ లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. 

అందుకే అజ్ఞాతంలోకి వెళ్లి మరీ వైసీపీలో చేరడానికి పావులు కదుపుతున్నారని సమాచారం. అయితే నారాయణ రాకను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారట. నారాయణ వైసీపీలోకి వస్తే క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అనిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అదేవిధంగా జగన్ కూడా నారాయణ రాకపై అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. కాకపోతే నారాయణ లాంటి బలమైన ఆర్థిక నేత ఉండటం పార్టీకి మంచిదని కొందరు జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ తన చేరిక విషయంలో వైసీపీ సానుకూలంగా స్పందించకపోతే.. బీజేపీ వైపు వెళ్లాలనే ఆలోచనలో కూడా నారాయణ ఉన్నట్లు తెలుస్తోంది.