TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గకపోతే.. రైతు ఉద్యమానికి 100 రెట్ల ఉద్యమం..

Published on: Fri Feb 5, 2021 12:58PM

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అంటూ ఆనాడు తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు చేసిన ఉద్యమ ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోపక్క కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ప్రజలు మరోసారి ఉద్యమానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.


ట్విట్టర్ వేదికగా స్పందించిన అయన ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. మా నగరం పేరే ఉక్కు నగరం. ఉక్కు సంకల్పంతోనే సాధించుకున్నాం. విశాఖ ఉక్కు నుంచి విశాఖ ను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీక. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దు.1966 నుంచి దశాబ్దకాలం పాటు "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం, 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు , 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిధ్ధమే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే... 100 రెట్లు ఉద్యమం, తీవ్రత చవి చూడాల్సి వస్తుంది. ’’ అంటూ గంటా ట్వీట్ చేశారు.