ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ.. గౌతమ్ సవాంగ్‌కు తీవ్ర అవమానం!
Published on: Thu Feb 17, 2022 10:32AM
నిన్నటి వరకూ పోలీస్ బాస్. డీజీపీగా ఏపీలో సూపర్ పవర్. పోలీసులంతా ఆయన కనుసన్నల్లో పని చేసేశారు. తాడేపల్లి ప్యాలెస్ ఆడించినట్టు ఆడేవారు!.. ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసేవారు! అనేవారు. ఇక, డీజీపీ కార్యాలయం సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీసుపై వైసీపీ మూకలు దాడి చేసినా అడ్డుకోలేకపోయారు.. స్వయానా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు.. టీడీపీ నేతలపై కేసులు, అరెస్టులకైతే లెక్కేలేదు.. అంతలా ప్రభుత్వానికి ఊడిగం చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను.. అర్థాంతరంగా, అవమానకరంగా ఆ పదవి నుంచి తొలగించేశారంటూ జగనన్నపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఇన్‌సల్ట్ చేయగా.. ఆ అవమానాలను కంటిన్యూ చేస్తూ.. తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి పడేసి.. మరింత దారుణంగా అవమానించారని అంటున్నారు. కనీసం, ఖాకీ యూనిఫాం కూడా వేసుకోనీయకుండా చేశారని మండిపడుతున్నారు.
మామూలుగా రిటైర్డ్ అయిన వారినో, రాజకీయ పునరావాసం కోసమో.. ఇలాంటి పదవులను ఇస్తుంటారు. కానీ, అత్యంత కీలకంగా ఉండి.. ఏపీ డీజీపీగా అధికారాన్ని అనుభవించిన గౌతమ్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్ట్ కట్టబెట్టడం అసలేమాత్రం సరికాదని ఐపీఎస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ ప్రకాశ్, గౌతమ్ సవాంగ్.. ఇలా సివిల్ సర్వెంట్లతో సీఎం జగన్‌రెడ్డి చెడుగుడు ఆడుకోవడంపై ఆయా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇలా అయితే ఏపీలో పని చేయలేమని అంటున్నారు. కొందరైతే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడానికీ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
గౌతమ్ సవాంగ్ చేసిన తప్పేంటి? టీడీపీ వారిని కేసులతో వేధించడమేనా? కేసినోలు పెట్టినా వదిలేయడమేనా? వైసీపీ అరాచకాలకు కొమ్ముకాయడమేనా? ఇవన్నీ చేసినప్పుడు సూపర్ డీజీపీ అని పొగిడిన జగన్‌రెడ్డే.. ఇప్పుడు సవాంగ్‌ను అంత దారుణంగా అవమానించడంతో సివిల్ సర్వెంట్స్ వర్గాలకు రాంగ్ మెసేజ్ వెళుతోంది. చలో విజయవాడను అడ్డుకోలేకపోవడం.. అశోక్‌బాబుకు బెయిల్ రావడం.. విశాఖలో గంజాయి దహనం.. ఈ మూడే డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై జగన్‌రెడ్డి కన్నెర్ర చేయడానికి కారణం అంటున్నారు. మరి, దాదాపు రెండేళ్లుగా ఆయన చెప్పినట్టే చేసినందుకు ప్రతిఫలం ఇదేనా? టీడీపీని టార్గెట్ చేసి వైసీపీని ఖుషీ చేసినందుకు ఇదేనా బహుమతి? చివరాఖరికి ఖాకీ యూనిఫాం కూడా వేసుకోనీయకుండా.. ఏపీపీఎస్సీ పోస్టుతో సరిపెట్టడం.. దారుణ అవమానం కాక మరొకటి కాదంటున్నారు.


