సుమలతను పడుకోబెట్టాలి.. మాజీ సీఎం రాజకీయ రచ్చ..
Published on: Tue Jul 6, 2021 12:17PM
అద్దూ అదుపూ ఉండదు.. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు.. ఇంకా చెప్పాలంటే ఎంత ఘాటుగా విమర్శిస్తే అంత పబ్లిసిటీ. రాజకీయాల్లో ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడటం కామనే అయినా.. అప్పుడప్పుడూ అవి కాంట్రవర్సీకి కారణమవుతాయి. అందులోనూ మహిళా నేతలను కామెంట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు మునిగిపోతాయి. కర్ణాటకలో ఇప్పుడదే జరుగుతోంది. మాజీ సీఎం కుమారస్వామి.. ఎంపీ సుమలతపై చేసిన విమర్శ ఇప్పుడు రాజకీయంగా మంట రేపుతోంది.
కావేరి నదికి అనుబంధంగా మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్-కేఆర్‌ఎస్ జలాశయం నుంచి వాటర్ లీక్ అవుతోందంటూ ఎంపీ సుమలత పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేఆర్‌ఎస్ జలాశయానికి పగుళ్లు ఏర్పడ్డాయని సుమలత పలుమార్లు ఆరోపించారు. దీంతో జలవనరుల విభాగం ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించింది. పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చింది. ఇదే అంశంపై మీడియా మాజీ సీఎం కుమారస్వామిని ప్రశ్నించగా.. ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. కేఆర్ఎస్ జలాశయం రక్షణను ఆమే పర్యవేక్షిస్తున్నట్లుగా బిల్డప్ కొడుతున్నారని.. లీకేజీలు నిలిచిపోవాలంటే సుమలతను అడ్డుగా పడుకోబెట్టాలంటూ వివాదాస్పద చేశారు. ఎంపీ సుమలతను అడ్డుగా పడుకోబెట్టాలి అనే స్టేట్‌మెంట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. ఆ మాటలను బట్టి ఆయన ఎటువంటివారో తెలుస్తోందన్నారు. ‘ముఖ్యమంత్రిగా కొనసాగారు. కనీస జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పారో దేశమంతా తెలుసు’ అని సుమలత ఫైర్ అయ్యారు. విమర్శలు చేయవచ్చు కానీ, మాట్లాడేటప్పుడు అదుపు ఉండాలన్నారు. కేఆర్‌ఎస్ ప్రాజెక్టు సమీపంలో గనుల తవ్వకాలతో సమస్య ఏర్పడుతోందని ఆరోపించారు. లీకేజీ జరిగే చోట మాజీ సీఎం కుమారస్వామినే పడుకోబెడితే సరిపోతుందంటూ రివర్స్ అటాక్ చేశారు ఎంపీ సుమలత.


