బూత్‌లో ఓట్లు 9.. కానీ బీజేపీకి వచ్చిన ఓట్లు 17

 

మూడో దశ పోలింగ్‌లోనూ ఈవీఎంల దుమారం రేగుతోంది. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడుతోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గోవాలో ఇవాళ ఉదయం జరిగిన మాక్‌ పోలింగ్‌లోనే ఈవీఎంల పనితీరు బయటపడిందంటూ ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ ఎల్వీస్‌ గోమ్స్‌ ట్వీట్‌ చేశారు. మాక్‌ పోలింగ్‌లో భాగంగా ఒక్కో పార్టీ అభ్యర్థికి 9 ఓట్లు చొప్పున కేటాయించగా.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థికి 17 ఓట్లు పోలైనట్టు చూపించిదని చెప్పారు. గోవాలోని బూత్‌ నంబర్‌ 31లో నిర్వహించిన మాక్‌ పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థికి 17, కాంగ్రెస్‌ అభ్యర్థికి 9, ఆప్‌ అభ్యర్థికి 8, ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయని గోమ్స్‌ వివరించారు. ఈ ఘటనను 'ఎలక్షన్‌ ఆఫ్‌ షేమ్‌'గా ఆయన అభివర్ణించారు. కాగా, గోమ్స్‌ ఆరోపణలకు స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు.. సంబంధిత పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలను మార్చమని ప్రకటించారు.

 

 

ఈవీఎంల పనితీరుపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలన్నింటిలోనూ సమస్యలు ఉన్నాయని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పోల్ అవుతున్నాయని ఆరోపించారు. చాలా చోట్ల ఈవీఎంలు బీజేపీకి అనూకూలంగా పనిచేస్తున్నాయని అన్నారు. రామ్‌పూర్‌లో ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే 350కిపైగా ఈవీఎంలను మార్చారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బందికి అవగాహన లేదని అధికారుల చెప్పడం బాధ్యతారాహిత్యమని అఖిలేష్‌ అభిప్రాయపడ్డారు.