ఐరోపాకు రావద్దు- ఐరోపా మండలి వినతి!
Published on: Fri Mar 4, 2016 3:51PM
.jpg)
సిరియాను అంతర్గత యుద్ధం ముంచెత్తుతోంది. ఇటు ప్రభుత్వానికీ అటు ISIS ఉగ్రవాద సంస్థకూ జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు కూడా జోక్యం చేసుకోవడంతో సిరియా రక్తసిక్తంగా మారిపోయింది. ఈ యుద్ధరంగం నుంచి తప్పించుకునేందుకు లక్షలాదిమంది ఐరోపాకు శరణార్థులుగా వలసకి వెళ్తున్నారు. ఐరోపా ముఖద్వారంగా భావించే టర్కీ ద్వారా స్వీడన్, గ్రీస్ వంటి ఐరోపా దేశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇలా చాలా ఐరోపా దేశాలు శరణార్థులతో నిండిపోయాయి. వచ్చిన వారిని తిరిగి పంపలేక, వారిని దేశంలోని శరణార్థి శిబిరాలలో ఉంచలేక పలు దేశాలు సతమతమవుతున్నాయి.
ఇటు శరణార్థ శిబిరాల వద్ద తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. దాంతో ఆర్థికంగానూ, శాంతిభద్రతల పరంగానూ గ్రీస్, స్వీడన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐరోపా మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ నిన్న ఒక ప్రకటనను జారీ చేశారు. శరణార్థులు తమ జీవితాలను, డబ్బుని పణంగా పెట్టి అక్రమంగా ఐరోపాలోకి ప్రవేశించే ప్రయత్నం చేయవద్దని డొనాల్డ్ అభ్యర్థించారు. ఇక్కడికి వచ్చాక వారు నానాఇబ్బందుల పడక తప్పదనీ, అందుకని ఐరోపాకి రాకపోవడమే మంచిదనీ ఆయన పేర్కొన్నారు. కానీ డొనాల్డ్ మాటలు వినే పరిస్థితుల్లో ఎవరూ ఉన్నట్లు కనిపించడం లేదు. క్రూరమైన ISIS దాడులకంటే ఐరోపా శరణార్థి శిబిరాలే మేలు కదా!


