TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు షాక్.. ఈటల వెంట బీజేపీలోకి కీలక నేతలు 

Published on: Fri Jun 11, 2021 3:32PM

తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. గులాబీ పార్టీకి వారం రోజుల క్రితం రాజీనామా చేసిన ఈటల.. కారు పార్టీ సింబల్ తో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాని వారం రోజులు ముగిసినా రాజీనామా సమర్పించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో రాజేందర్ పునరాలోచన చేస్తున్నారనే చర్చ జరిగింది. ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఎదుర్కోవడం కష్టమని ఈటల భయపడుతున్నారనే వాదన కూడా వినిపించింది. తాజాగా వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు ఈటల.

ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో చేరికలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా అపాయింట్ మెంట్ ఖరారైందని సమాచారం. శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. ఆదివారం తనతో వచ్చే నేతలతో కలిసి ఢల్లీ వెళతారని చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ బీజేపీలో చేరునున్నారని గతంలోనే ప్రకటన వచ్చింది. తాజాగా రాజేందర్ కు మరో ముగ్గురు నేతలు తోడయ్యారు. 

కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ ముగ్గురు కీలక నేతలు కమలం గూటికి చేరనున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, సీనియర్ నేత కేశవరెడ్డితో పాటు టీఎంయీ మాజీ అధ్యక్షుడు అశ్వథామరెడ్డి కూడా ఈటలతో కలిసి కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తో పాటు తెలంగాణ సీనియర్ నేతలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ సహా పలువురు నేతలు శుక్రవారం ఈటల నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల నివాసంలో బీజేపీ నేతలను కలిశారు రమేష్ రాథోడ్, కేశవరెడ్డి, అశ్వథామరెడ్డి. తాము కూడా బీజేపీలో చేరుతామని తెలిపారు. 

ఇక శనివారం ఉదయం గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.