రాజీ లేని రాజేందర్.. ముచ్చటగా మూడోసారి.. దొరపై గెలిచి నిలిచేనా?
Published on: Sat Jun 12, 2021 5:11PM
పదవి పొందటం ఎంత కష్టమో.. ఆ పదవిని వదులుకోవడం అంతకన్నా కష్టం. హోరాహోరీగా సాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకూ వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేందర్. అందులో, మూడుసార్లు తన ఎమ్మెల్యే గిరిని తృణప్రాయంగా వదిలేయడం మామూలు విషయమేమీ కాదు. తాజాగా, ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల. ఉదయం పదకొండున్నరకి ఇలా రాజీనామా లేఖ అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారో లేదో.. అలా.. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించడం ఆసక్తికరం. ఆ వెంటనే, హుజురాబాద్ నియోజకవర్గం ఖాళీ అయినట్టు చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం వెంటవెంటనే జరిగిపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. ఈ ఏడేళ్లల్లో పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందరే. అయితే, ఇలా రాజీనామా చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రత్యేక రాష్ట్ర సాదన కోసం రెండుసార్లు ఇలానే ఎమ్మెల్యే పోస్ట్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడిలా స్వరాష్ట్రంలో పదవి వదులుకోవాల్సి వస్తుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. ప్రగతి భవన్‌తో విభేదించి.. బానిస భవన్ గోడలు బద్దలుకొట్టడానికంటూ.. గడీల పాలనకు వ్యతిరేకంగా.. దొరపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు ఈ ఉద్యమ నాయకుడు.
ఆనాడు ఉద్యమాన్ని ఉరకలు ఎత్తించడానికి రాజీనామాను బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తే.. ఈనాడు హుజురాబాద్ కేంద్రంగా మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు రాజీనామా చేశానంటున్నారు రాజేందర్. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమేనని.. ధర్మం తన పక్షాన ఉంది కాబట్టి.. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆయన రెండుసార్లు ఇలానే రాజీనామా చేసి.. గెలుపొందారు మరి. మూడోసారి కూడా చరిత్ర రిపీట్ అవుతుందనే నమ్మకంతో.. కేసీఆర్‌తో రాజీ పడకుండా రాజీనామా అస్త్రం ప్రయోగించారు.
2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కమలాపూర్‌లో పోటీ చేసి.. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి తన ఉనికిని బలంగా చాటుతూ.. ఘనంగా అసెంబ్లీ ప్రస్తానం ప్రారంభించారు ఈటల రాజేందర్. 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ నియోజకవర్గం రద్దయింది. హుజూరాబాద్ కేంద్రంగా కొత్తగా నియోజకవర్గం ఏర్పడింది.

ఉద్యమంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు.. 2008, 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి.. అసెంబ్లీలో ప్రత్యేక రాష్ట్ర ప్రకంపణలు తీసుకొచ్చారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో ఈటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో మారుమోగుతుంటాయి. ఏమయ్యా రాజేంద్ర.. పట్టుమని పది సీట్లు కూడా గెలవలేక పోయారు.. తల ఎక్కడ పెట్టుకుంటావయ్యా.. అంటూ వైఎస్సార్ చేసిన కామెంట్లు అప్పడూ, ఇప్పుడూ హాట్ టాపికే.

ఈటల చూట్టానికి సాదాసీదాగా కనిపించినా.. ఆయన రాజకీయ చరిత్ర సంచలనమే. విద్యార్థి దశలో పీడీఎస్‌యూ నాయకుడిగా, ఆ తర్వాత నక్సలైట్‌గా.. అటుపిమ్మట ఉద్యమ నేతగా.. ఫౌల్ట్రీ వ్యాపారిగా.. వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్ శాసనసభ్యుడిగా.. మొత్తంగా వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఘనచరిత్ర ఆయనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కేసీఆర్ రెండో దఫా పాలనతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. కేబినెట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆత్మాభిమానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి.. కేసీఆర్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఇన్నేళ్లూ కేసీఆర్ నీడలో గెలిచిన ఈటల.. ఈసారి కేసీఆర్‌కే సవాల్ చేసి గెలిచి నిలుస్తారా? లేదా? అనేది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే పరిణామం.



