తెలంగాణలో రెండో సీఎం! ఎవరో తెలుసా...
Published on: Sun Jun 6, 2021 7:11PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత రోజుకో కీలక అంశం బయటికి వస్తోంది. తాజాగా తెలంగాణలో రెండో సీఎం విషయం వెలుగులోనికి వచ్చింది. టీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్ నేత రెండో సీఎం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరూ లేరు. తొలి ప్రభుత్వంలో ఇద్దరు డిప్యుటీ సీఎంలుగా ఉన్నా.. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఆ సంప్రదాయానికి తెరదించారు గులాబీ బాస్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్న కేటీఆర్.. ప్రగతి భవన్ లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. సీఎం కేసీఆర్ చూడాల్సిన కొన్ని కార్యక్రమాలను కూడా కేటీఆర్ చూడటం... విదేశీ ప్రతినిధులు ఆయననే కలుస్తుండటంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతుంది. అయితే షాడో సీఎం అనే వ్యాఖ్యలు ఎప్పటినుంచో ఉండగా.. తాజాగా తెరపైకి వచ్చిన రెండో సీఎం అంశంమే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్ పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేసింది. తమ పట్టు కోల్పోకుండా.. నేతలు, కార్యకర్తలు చేజారకుండా జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ , మాజీ మంత్రి బసవరాజు సారయ్య సమావేశమయ్యారు. అందరూ టీఆర్ఎస్ వెంటనే ఉండాలని ప్రమాణం చేయించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిలా కేసీఆర్ చూసుకున్నారని అన్నారు. తండ్రిలాంటి వాడిని ధిక్కరించి.. కష్టపడి గెలిపించిన తమల్ని కాదని.. ఈటల వెళ్లిపోయాడని విమర్శించారు. ఈటలను ఎవరూ బయటకు పంపలేదని.. తనకు తానుగానే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీయని.. అలాంటి పార్టీలోకి ఈటల వెళ్లడం దారుణమని మండిపడ్డారు సారయ్య.
ఈటల రాజేందర్ రెండో సీఎం అంటూ బస్వరాజు సారయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ పేరును 'బానిసల నిలయం'గా మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే.. తాను బతకలేనని ఈటల స్పష్టం చేశారు. తాను బానిసలా ఉండలేకే బయటికి వచ్చానని ఈటల ఆరోపిస్తుండగా.. కేసీఆర్ రెండో సీఎంగా ఈటలను చూశారని సారయ్య చెప్పడం ఆసక్తి రేపుతోంది.


