తగ్గేదే లే.. ఈటల బలప్రదర్శన.. మరి, రాజీనామా? భయమా! వ్యూహమా!
Published on: Tue Jun 8, 2021 1:52PM
తెలంగాణ అటెన్షన్ అంతా హుజురాబాద్ మీదే. ఈటల రాజీనామా అంశం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రాజకీయం చాలారోజుల తర్వాత కాక మీదుంది. ఏకంగా కేసీఆర్‌పైకే ఈటల.. ఈటెలతో దూసుకొస్తుండటంతో రాజకీయం రంజుగా మారింది. బస్తీ మే సవాల్ అంటూ ఇటు కేసీఆర్, అటు రాజేందర్.. సై అంటే సై అంటూ తొడలు కొట్టడంతో పోరుగడ్డ మీద పొట్టేళ్ల పోట్లాట జోరుమీదుంది. కేబినెట్ నుంచి ఈటల బర్తరఫ్.. భూకబ్జాలపై కేసులు, కమిటీలతో కేసీఆర్ మొదట పావులు కదిపారు. కౌంటర్‌గా ఈటల బీజేపీతో చర్చలు, ఢిల్లీ టూర్‌తో గులాబీ బాస్‌కు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. గ్రౌండ్‌వర్క్ మొత్తం ప్రిపేర్ అయ్యాక.. తాను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అనుచరుల చప్పట్ల మధ్య ప్రకటించారు ఈటల రాజేందర్. ఇక అంతే. రోజులు గడుస్తున్నా.. ఆయన నుంచీ ఉలుకూ-పలుకూ లేదు. ఇంకా ఎలాంటి ముందడుగులూ పడలేదు. ప్రెస్‌మీట్లో రాజీనామాను ప్రకటిస్తే సరిపోద్దా? దానికో పద్దతి ఉంటుందని ఈటలకు తెలియంది కాదు. అయినా, ఆయన ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇక్కడే పలు ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు వినిపిస్తున్నాయి.
వారం రోజుల్లో ఈటల బీజేపీలో చేరుతారు. గతం వారం రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. రోజులు గడుస్తున్నాయి కానీ, ఈటల మాత్రం రాజీనామా చేయడం లేదు.. బీజేపీలోనూ చేరడం లేదు. అటు, టీఆర్ఎస్ నేతలు మాత్రం రాజీనామా చేస్తావా? పార్టీ నుంచి కూడా వెళ్లగొట్టమంటావా? అంటూ రెచ్చగొడుతున్నారు. ఈటల మాత్రం తుఫాను ముందు ప్రశాంతతలా.. తన పని తాను చేసుకుపోతున్నారు. వేటాడే పులి.. రెండడుగులు వెనక్కి వేసి దాడి చేసినట్టు.. ఈటల రాజేందర్ తన బలాన్ని, బలగాన్ని బేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో తన సత్తా ఎంతో మరోసారి చెక్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. గులాబీ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు చేజారిన వారు ఎందరు? ఈటలే తమ నాయకుడంటూ తన వెంట కలిసి నడిచే అనుచరులు ఎవరు? తేల్చే పనిలో పడ్డారు. తన సత్తా, సత్తువా ఎంతో కేసీఆర్‌కు తెలిసొచ్చేలా బల ప్రదర్శనకు దిగుతున్నారు.
తాజాగా, టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇస్తూ.. 7 గ్రామాల సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు అధికార పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. వీణవంక మండలానికి చెందిన 7 గ్రామాల సర్పంచ్‌లు, వైస్ ఎంపీపీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం 12 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్‌ను వీడారు. తామంతా ఈటల వెంటే ఉన్నామంటూ కేసీఆర్‌కు తెలిసొచ్చేలా.. వీణవంకలో ఈటలకు మద్దతుగా పదర్శన నిర్వహించడం విశేషం.
అటు.. ఈటల సైతం తన సొంత ఇలాఖాలో బల ప్రదర్శనకు దిగారు. కమలాపూర్‌లో భారీ ఎత్తున రోడ్‌షో నిర్వహించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేసిన తర్వాత ఆయన తొలిసారి నియోజకవర్గానికి వెళ్లారు. ఈటల మద్దతుదారులు, అభిమానులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళహారతులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు.
అభిమానుల జేజేల మధ్య ఈటల సైతం కేసీఆర్‌పై హూంకరించారు. హుజూరాబాద్ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతానని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని రాజేందర్ సింహగర్జన చేవారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందని.. అందులో ధర్మానిదే విజయమని.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తామన్నారు ఈటల రాజేందర్.
ఇలా, ఈటల తగ్గేదే లే.. అంటూ కేసీఆర్‌పై దండయాత్రకు రెడీ అవుతున్నారు. ఇదంతా సరే కానీ.. మరి, రాజీనామా ఏమైందని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ప్రకటన చేస్తే సరిపోతుందా.. స్పీకర్‌కు ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వరా అంటూ నిలదీస్తున్నారు. రాజీనామా ప్రకటన చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. 5 నిమిషాల పనికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారా? అని ప్రజల్లోనూ అనుమానం నెలకొంది. రాజీనామాతో పాటు బీజేపీలో చేరే అంశమూ లేట్ అవుతుండటంతో అసలు ఈటల ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా? లేక, స్ట్రాటజీ ఏమైనా మారుస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఈటల, టీఆర్ఎస్ నేతలు పరస్పరం చేసుకున్న విమర్శలను చూస్తే.. ఆయన ఒక్కక్షణం కూడా ఇక పార్టీలో, పదవిలో కొనసాగరని అంతా భావించారు. కానీ, ఈటల మాత్రం నింపాదిగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే పదవిలోనే కాదు.. ఇంకా టీఆర్ఎస్ సభ్యునిగానే ఉన్నారు రాజేందర్. ఆయన ఆలస్యం చేస్తున్నా కొద్దీ.. అధికారపార్టీలో అసహనం పెరిగిపోతోంది. ఈటల రాజీనామా చేసే వరకూ ఆగాలా? లేక, ఉన్నపళంగా వేటు వేసేయాలా అనే చర్చ కూడా కారు పార్టీలో జరుగుతోందట.
అయితే, రాజీనామా విషయంలో ఈటల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించారు కాబట్టి.. ఈటలనే పార్టీని, పదవిని తృణప్రాయంగా వదిలేశారని ప్రజల్లో ముద్రపడిపోతుంది. ఆలస్యం అవుతున్నా కొద్దీ.. ఈటల ఎపిసోడ్ నిత్యం జనాల నోళ్లల్లో నానుతుంటుంది. ఆ మేరకు తనకు ఇమేజ్‌తో పాటు సానుభూతి పెరుగుతుంది. ఆ లోగా.. తన బలాన్ని, బలగాన్ని సమీకరించుకోడానికి సమయమూ చిక్కుతుంది. అంతా ఓకే అయ్యాక.. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనులన్నీ చక్కబెట్టుకున్నాక.. ఇక సరైన సమయంలో కార్యచరణ అమలు చేసేలా ఈటల వ్యూహరచన చేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి తెలుస్తోంది. ఈలోగా కేసీఆర్ తనపై వేటు వేస్తే.. ఆ మేరకు అదనపు సానుభూతి సైతం తనకు కలిసొస్తుంది.
ఒకవేళ తాను ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా.. వెంటనే ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి కూడా లేదు. మరో ఆరు నెలలో.. అంతకు మించి సమయమో పట్టే అవకాశం ఉంది. అంత ఆలస్యంగా జరిగే ఎన్నికకు.. ఇప్పుడే హడావుడిగా రాజీనామా చేయాల్సిన అవసరమేమీ లేదన్నది ఈటల రాజేందర్ అంతరార్థంగా అనిపిస్తోంది. అందుకే, రాజీనామా విషయంలో ఈటల ఏమాత్రం తొందరపడటం లేదని.. స్లో అండ్ స్టడీగా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. ఎవరి విశ్లేషణ ఎలా ఉన్నా.. ఈటల రాజీనామాపై త్వరలోనే స్పష్టత రావడం మాత్రం ఖాయం. అప్పుడుంటుందిక అసలైన పోరు తెలంగాణం...


