TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరీష్ రావుపై ఈటల యుద్ధం.. సిద్దిపేటలో దళిత గర్జన సభ?

Published on: Thu Nov 4, 2021 10:00PM

హుజురాబాద్ ఉప సమరం ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్దమే సాగింది. పార్టీలు అనే కంటే సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య పోరాటం అని చెప్పాల్సిందే. ఈటలను ఓడించేందుకు అన్ని శక్తులు బయటికి తీశారు కేసీఆర్. అటు గులాబీ పార్టీకి తన సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డారు రాజేందర్. అయితే కేసీఆర్ ఆదేశాలతో అంతా తానే వ్యవహరించారు మంత్రి హరీష్ రావు. మూడు నెలల పాటు హుజురాబాద్ లోనే మకాం వేశారు. గతంలో తనకు అత్యంత సన్నిహితింగా ఉన్న ఈటలను ఓడించేందుకు శ్రమించారు. అంతేకాదు ప్రచారంలో రాజేందర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు హరీష్ రావు.

హుజురాబాద్ ప్రచారంలో తనను టార్గెట్ చేసిన హరీష్ ను మొదట కార్నర్ చేయలేదు ఈటల. కాని హరీష్ దూకుడు పెంచడంతో రాజేందర్ కూడా నోటికి పని చేప్పారు. ఈ నేపథ్యంలో హరీష్, ఈటల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరు మిత్రుల మధ్య సాగిన సమరంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. మామ ఆదేశాలతో హరీష్ ఒకింత దూకుడుగా వెళ్లారని, తనతో చాలా కాలం పనిచేసిన రాజేందర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వచ్చాయి. రాజేందర్ కూడా హరీష్ రావు పని పడతానని ప్రకటించారు.

హుజురాబాద్ లో జయకేతనం ఎగురవేసిన ఈటల ఇప్పుడు తనదైన శైలిలో మాటలు పేల్చుతున్నారు. ఆయన చెప్పినట్లే ముందుగా హరీష్ రావునే టార్గెట్ చేశారు. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న రాజేందర్... మధ్యలో సిద్ధిపేట వెళ్లారు. అక్కడి అమరవీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావుపై  ఫైర్ అయ్యారు ఈటల.  సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని తప్పుబట్టారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేశారని, ఆ దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. రాజేందర్ ప్రకటనలో త్వరలోనే ఆయన సిద్ధిపేటలో పర్యటిస్తారని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి చేయాల్సిన అన్ని కుట్రలను హరీష్ రావు చేశారని భావిస్తున్న ఈటల రాజేందర్.. సిద్ధిపేట నుంచే తన పోరాటం మొదలుపెట్టపోతున్నారని చెబుతున్నారు.