ఈటలకు క్రొకడైల్ ఫెస్టివల్.. అందరివాడు కొందరివాడై..!
Published on: Wed Jun 16, 2021 4:09PM
ఇలా రాజీనామా చేసి.. అలా బీజేపీలో చేరి.. ఆ వెంటనే ఉప ఎన్నిక వచ్చేసి.. ఆ వెనువెంటనే తాను ఎమ్మెల్యేగా గెలిచేసి.. కేసీఆర్ నెత్తి కొట్టేందుకు అసెంబ్లీలో అడుగుపెడతాననేది ఈటల రాజేందర్ లెక్క. అయితే, లెక్క బాగానే ఉందికానీ.. పరిస్థితే అంతా తిక్క తిక్కగా మారింది. రాజీనామా, బీజేపీలో చేరిక వరకూ అంతా సవ్యంగానే సాగింది. ఎందుకంటే ఆ రెండూ ఆయన చేతిలో ఉన్న పనులే కాబట్టి. ఇందులోనూ చివరాఖరున కాస్త తేడా కొట్టినట్టుంది. ఢిల్లీలో ఈటలకు అవమానం జరిగింది.. అమిత్‌షా, నడ్డాలు రాలేదు.. రాజేందర్ స్థాయి తగ్గించేశారు.. ఇలా గుసగుసలు గట్టిగానే వినిపించాయి. ఇలాంటి అవమాన భారాలు, దూరాలు రాజకీయాల్లో కామనే అనుకుని.. తుడిపేసుకుపోవడమే పాలిటిక్స్ అంటే. అది వేరే విషయం అనుకోండి. ఇక, వాట్ నెక్ట్స్? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.
రాజీనామాకు ముందే కాంగ్రెస్ నేతలతో భేటీ అయి.. మీ మద్దతు నాకేనంటూ రిక్వెస్ట్ చేశారు ఈటల. తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే అనేది అట్నుంచి వచ్చిన రిప్లై. ఇండిపెండెంట్‌గా పోటీ చేయ్.. కుదిరితే సపోర్ట్ చేస్తామనేది కాంగ్రెస్ ఆన్సర్. నువ్ బడుగుల బాహుబలివి.. సింగిల్‌గా బరిలో దిగితే.. మా అందరి మద్దతు మీకేనంటూ ఇటు ప్రజాసంఘాలు, అటు ఉద్యమకారులు ఈటలకు మద్దతు ఇచ్చేందుకు పోటీపడ్డాయి. కోదండరాం సారు, కొండా గారు.. అయితే ఈటలను కాళ్లావేళ్లా పట్టుకున్నంత పని చేశారు. మరీ మరీ బతిమిలాడుకున్నారు.. బాబ్బాబు మా ఆశాకిరణం నువ్వే.. నువ్ గానీ బీజేపీలో చేరితే మా దీపం కొండెక్కినట్టే.. స్వతంత్రంగా పోటీ చేయండి.. మన సత్తా ఏంటో చూపిద్దాం.. అంటూ తెగ నచ్చజెప్పారు. వింటేగా.. ఈటల అసలు వింటేగా... నా కేసులు, నా కష్టాలు నావి.. నేనెవరికి చెప్పుకోను.. మిమ్మల్ని ఏల నమ్ముకోనూ.. అన్నట్టు అందరికీ రాం రాం.. చెప్పేసి.. ఢిల్లీ వెళ్లి జై శ్రీరాం అనొచ్చారు.
ఢిల్లీ నుంచి హుజురాబాద్ తిరిగొచ్చే సరికి సీన్ మొత్తం మారిపోయింది. ప్రజా సంఘాలు, ఉద్యమ కారులు.. అంతా రివర్స్ అయిపోయారు. పోటుగాడివని అనుకుంటే.. కాషాయం పార్టీతో కలుస్తావా అంటూ అంతా సైడ్ అయిపోయారు. మీ ఆస్తులే మీకు ముఖ్యం కానీ.. ప్రజా ఉద్యమం కాదా? అంటూ కస్సుమంటున్నారు. తన డీఎన్ఏలోనే కమ్యూనిజం ఉందని ప్రకటించుకున్న ఈటలకు.. ఇప్పుడదే కామ్రేడ్ల నుంచి వార్నింగ్ కూడా వచ్చింది. ఈటల రాజేందర్ ప్రజాద్రోహి అంటూ మావోయిస్టు పార్టీ నుంచి లేఖ రావడం కలకలం రేపింది. ఈటలకు ప్రజాసంఘాలు, ఉద్యమకారులెవరూ మద్దతు పలకొద్దని మావోయిస్టులు పిలుపు ఇవ్వడం షాకింగ్ పరిణామం.
ఇక, బీజేపీనే తన అండా, దండా అనుకొని ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే, ఢిల్లీలో దక్కిన ప్రాధాన్యతను అంతా టీవీల్లో చూసి ఆయనకు బీజేపీ ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంతో డిసైడ్ అయిపోయారు. అబ్బో.. ఇలాగైతే ముందుముందు కష్టమేనని మెళ్లిగా అనుచర వర్గమూ చేజారిపోతోందని అంటున్నారు. ఇటు అధికార పార్టీ నుంచి ప్రెజర్.. అటు బీజేపీ నుంచి కన్ఫ్యూజన్.. ఎందుకైనా మంచిదని కొందరు న్యూట్రల్‌గా ఉంటున్నారట. ఇక, సొంత నియోజకవర్గంలోనే బీజేపీ నాయకుల నుంచి ఎదురుదెబ్బలు తప్పేలా లేవు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. హుజురాబాద్‌లో బీజేపీ కేండిడేట్‌గా చెలామణి అవుతున్న.. ఒకప్పటి టీడీపీ బడా నేత పెద్దిరెడ్డి.. ఈటలపై ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనొచ్చి తన సీటుకు ఎసరు పెడితే ఎలా..? తనను కాదని ఈటలకు టికెట్ ఇస్తే.. పార్టీలో ఉండే ప్రసక్తే లేదు.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ సహచరుల దగ్గర రెబెల్ జెండా ఎగరేస్తున్నారట పెద్దిరెడ్డి. ఎంత చెడినా.. పెద్దిరెడ్డికి ఇప్పటికీ ఎంతోకొంత ఫాలోయింగ్ లేకపోలేదు. ఆ మేరకు ఈటలకు నష్టం జరగకపోదు.
అటు, రాజీనామాకు ముందు ఇంటి చుట్టూ తిరిగిన కోదండరాం సారు కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డిక కానీ.. ఇప్పుడు అటువైపే చూడటం లేదు. ఎందుకు చూస్తారు లెండీ.. అంత మంచిగా చెప్పినా విననప్పుడు.. ఎవరి పాపాన వాళ్లు పోతారని సైలెంట్ అయి ఉంటారని అంటున్నారు. బీజేపీ అనగానే బహిరంగంగా సపోర్ట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు కొన్నివర్గాలు. ఈటల మీద ఎక్కడలేని అభిమానం ఉన్నా.. పువ్వు గుర్తుకు ఓటేసేందుకు ఎంతమంది సిద్దమవుతారనేదే ఈటల గెలుపోటములను డిసైడ్ చేసే పాయింట్. ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోవడం ఆయన వరకూ కరెక్టే అయినా.. బీజేపీలో చేరి అందరివాడైన ఈటల.. కొందరివాడై పోయాడనే ఆవేదన ఆయన అనుచరవర్గంలో వ్యక్తమవుతోంది. పరిస్థితులూ అలానే మారుతున్నాయి మరి.


