TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈట‌ల వెడ్స్ బీజేపీ.. ఎవ‌రికెవ‌రు? ఎవ‌రి లెక్కేంటి?

Published on: Tue Jun 15, 2021 4:28PM

ప్ర‌త్యేక విమానం వేసుకొని.. మందీమార్బ‌లాన్ని వెంటేసుకొని.. అట్ట‌హాసంగా హ‌స్తిన పోతే.. అక్క‌డ అంతంత మాత్ర‌మే ప్రాధాన్యం ద‌క్కిందంటున్నారు ఈట‌ల ఎపిసోడ్ చూసిన వాళ్లంతా. కాషాయ కండువా అయితే మెడ‌లో వేసుకున్నారు కానీ, ఆయ‌న ముఖంలో వెలుగే లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అమిత్‌షాతో కండువా క‌ప్పించుకోవాల‌ని క‌ల‌లు కంటే.. క‌నీసం బాబుమోహ‌న్ అంత‌టి స్థాయి గౌర‌వం కూడా త‌న‌కు ద‌క్క‌లేదంటూ.. ఉసూరుమంటూ ఢిల్లీ నుంచి తిరిగొచ్చార‌ట ఈట‌ల‌. తెలంగాణలో కేసీఆర్ త‌ర్వాత కేసీఆర్ అంత‌టోడు.. ఢిల్లీకి వెళ్లి.. బీజేపీలో చేరి.. గుంపులో గోవింద‌లా మారిపోయార‌ని అంటున్నారు. తాజా ప‌రిణామంతో ఎవ‌రు ఎవ‌రికి అవ‌స‌రం? ఎవ‌రితో ఎవ‌రికి లాభం? అనే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తోంది.  

బీజేపీలో ఎంత‌టి వారైనా పార్టీ ముందు దిగ‌దుడుపే. ఒక్క మోదీ, అమిత్‌షాల‌కు మాత్రం మిన‌హాయింపు అనుకోండి. బీజేపీ సైద్దాంతిక ప‌ర‌మైన పార్టీ. నేత‌ల‌కంటే పార్టీ సిద్దాంతాల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. నాయ‌కుల‌కే పార్టీ బ‌లంగా మారుతుంది. క్షేత్ర స్థాయిలో చాప‌కింద నీరులా వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టే ఆర్ఎస్ఎస్.. బీజేపీకి వెన్నుముక‌. చిన్న‌ప్పుడే ఖాకీ నిక్క‌రు తొడిగించి.. చేతిలో క‌ర్ర పెట్టి.. హిందుత్వాన్ని గుండెల నిండా నూరుపోసే వ్య‌వ‌స్థ దాని సొంతం. అందుకే, చేతిలో అధికారం ఉన్నా, లేక‌పోయినా.. నిఖార్సైన క‌మ‌ల‌నాథులు పార్టీ వెంటే నిలుస్తారు. ప్రాణం పోయినా పార్టీని వీడ‌రు. అదే బీజేపీ బ‌లం, బ‌ల‌గం. 

అయితే, మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు.. బీజేపీలోనూ కొత్త నీరు వ‌చ్చి చేరుతోంది. రాత్రికి రాత్రే జంపింగ్ జ‌పాంగ్‌లు వ‌చ్చి ప‌డుతున్నారు. గోపీలంతా బీజేపీ వైపే దూకుతున్నారు. సిద్ధాంతాలు తొక్కా తోలు ఏమీ అక్క‌ర‌లేదు. అవ‌స‌రం ఉంటే చాలు. పార్టీ కండువా క‌ప్పేస్తున్నారు. ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేస్తున్నారు. ఇదీ ఈ మ‌ధ్య బీజేపీ అవ‌లంభిస్తున్న పొలిటిక‌ల్‌ స్ట్రాట‌జీ. అందుకే, నామినేష‌న్ల‌కు ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌దు బీజేపీ. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆ పార్టీకి అభ్య‌ర్థులే ఉండ‌రు కాబ‌ట్టి. ఆ చివ‌రి గ‌డియ వ‌ర‌కూ వేరే పార్టీ నుంచి కాస్తో కూస్తో పేరున్న నాయ‌కులెవ‌రైనా రాక‌పోతారా? అంటూ ఎదురు చూస్తుంటారు. అందుకే, ప‌క్క పార్టీలో సీట్లు రాని నేత‌లంద‌రికీ, వేరే పార్టీలో ప్రాభ‌వం ద‌క్కని అసంతృప్తులంద‌రికీ బీజేపీనే రాజ‌కీయ వేదిక అవుతోంది. ఎంత కాద‌న్నా.. కొంత‌కాలంగా ఇదే జ‌రుగుతోంది. ఈట‌ల విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ని అంటున్నారు.    

నా డీఎన్ఏ క‌మ్యూనిజం అని చెప్పుకునే ఈట‌ల‌.. బీజేపీలో చేర‌డం ఆయ‌న అవ‌స‌రమే త‌ప్ప మ‌రొక‌టి కాద‌నేది వాస్త‌వం. కేసీఆర్‌పై పోరాడాలంటే బీజేపీ అయితేనే బెట‌ర్ అనే భావ‌నతో మాత్ర‌మే కాషాయ కండువా కప్పుకుని ఉండి ఉంటారు కానీ.. ఆ పార్టీ సిద్దాంతాలో, నాయ‌క‌త్వ‌మో న‌చ్చి మాత్రం కాక‌పోవ‌చ్చు. కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉన్నా.. మునిగే నావ‌ను ఎక్కేంత అమాయ‌కుడేమీ కాదు ఈట‌ల రాజేంద‌ర్‌. బీజేపీలో చేర‌డం ఈట‌ల‌కు ఎంతో అవ‌స‌రం.. మ‌రి, ఈట‌ల‌తో బీజేపీకి ఎంత అవ‌స‌రం..? ఇదే ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్‌. 

ఢిల్లీలో జ‌రిగిన ప‌రిణామం చూస్తే క్లారిటీ వ‌చ్చేస్తుంది బీజేపీ ఈట‌ల‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్ప‌డానికి. ముర‌ళీధ‌ర్‌రావు, కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, డీకే అరుణ‌, ర‌ఘునంద‌న్‌రావు, వివేక్‌.. ఇలా వాళ్ల‌లో ఒక‌డు ఈట‌ల‌. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే వీళ్లంద‌రి త‌ర్వాతే ఈట‌ల‌.. అనే సంకేతాన్ని ధర్మేంద్ర ప్ర‌ధాన్ ద్వారా ఇచ్చేసింది బీజేపీ. మోదీ, అమిత్‌షాలు కాక‌పోయినా.. జేపీ న‌డ్డా అయినా ఈట‌ల‌కు కండువా క‌ప్పితే బాగుండేది అంటున్నారు. కావాల‌నే న‌డ్డా రాలేద‌ని.. పార్టీకంటే ఎవ‌రూ గొప్ప‌కాద‌ని.. ఈట‌ల కోసం తాము వెంప‌ర్లాడ‌లేద‌నే.. మెసేజ్ ఇచ్చేందుకే పార్టీ జాతీయ అధ్య‌క్షులు స్వ‌యానా ఈట‌ల జాయినింగ్ కార్య‌క్ర‌మానికి రాలేద‌ని చెబుతున్నారు. ఆ ప‌రిణామానికి ఈట‌ల‌తో పాటు ఆయ‌న వెంట వెళ్లిన అనుచ‌రులూ కంగు తిన్నార‌ట‌. ఇక ఆ దృశ్యాల‌ను టీవీల్లో చేసిన ఈట‌ల అభిమానులు అప్ప‌టి నుంచి తెగ ఇదై పోతున్నారు. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయాయేం.. అంటూ తెగ మ‌ద‌న ప‌డుతున్నార‌ట‌. 

ఈట‌ల బీజేపీలోకి వెళ్లాల్సింది కాద‌నే మొద‌టి నుంచి అన్ని వ‌ర్గాల నుంచీ వినిపిస్తోంది. కోదండ‌రాం, విశ్వేశ్వ‌ర‌రెడ్డిలాంటి వాళ్లు సైతం ఇదే అభిప్రాయం చెప్పారు. ఈట‌ల వ‌ర్గీయులు సైతం అవ‌స‌ర‌మైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌ని కోరారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగితే.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంటుంద‌ని భావించారు. ఇండిపెండెంట్ అయితే తామూ మ‌ద్ద‌తిచ్చేందుకు ఆలోచిస్తామ‌ని కాంగ్రెస్ నుంచి కూడా హామీ ల‌భించింది. కానీ, మోసేవాడికే తెలుస్తుంది కావ‌డి బ‌రువు అన్న‌ట్టు.. కేసీఆర్‌ను తాను సింగిల్‌గా ఢీకొట్ట‌లేన‌నే సంగ‌తి ఆయ‌న అనుచ‌రుడైన ఈట‌ల‌కు బహు బాగా తెలుసు. ఇక‌, కాంగ్రెస్ కుమ్ములాట‌ల విష‌యం తెలిసిందే. రేవంత్‌రెడ్డినే నెగ‌ల‌నీయ‌ని ప‌రిస్థితి హ‌స్తం పార్టీది. అందుకే, అన్నీ ఆలోచించే.. అవ‌స‌రం మేర‌కే.. బీజేపీలో చేరారు ఈట‌ల రాజేంద‌ర్ అంటారు. ఈట‌ల కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో ప‌లు వ‌ర్గాలు ఆయ‌న‌కు దూరం అవ‌క త‌ప్ప‌దు. ఆత్మ‌గౌర‌వ పోరాటం అనే డైలాగ్ ఇక‌పై అంత‌గా ప‌ని చేయ‌క‌పోవ‌చ్చు. హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీలో చేరి.. సోష‌లిజం, క‌మ్యూనిజం, బీసీయిజం.. అంటూ నీతులు చెబితే జ‌నాలు న‌మ్మ‌క‌పోవ‌చ్చు. ఇలా కొంత న‌ష్టం ఉన్నా.. కేంద్రం అండ అనే లాభం ముందు వీట‌న్నిటికీ కాంప్ర‌మైజ్ అయిన‌ట్టున్నారు ఈట‌ల‌.

ఇక‌, ఈట‌ల చేరిక‌తో బీజేపీకి.. రాజేంద‌ర్‌కు వ‌చ్చేంత లాభం రాక‌పోవ‌చ్చు. ఒక సీటో, నాలుగు ఓట్లో ఎక్కువ వ‌స్తాయి కానీ, ఈట‌ల‌కు తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేంత స‌త్తా లేద‌ని కాషాయం పెద్ద‌ల‌కు తెలుసు. డీకే అరుణలాంటి వాళ్లు కాంగ్రెస్‌లో సెల‌బ్రెటీ స్టేట‌స్‌లో ఉండ‌గానే.. బీజేపీప‌ట్ల ఆక‌ర్షితులై పార్టీలో చేరారు. అందుకే, అమిత్‌షానే స్వ‌యంగా ఆమెను పార్టీలోకి ఆహ్వానించి కండువా క‌ప్పారు. అదే, ఈట‌ల మాత్రం కేసీఆర్ మెడ‌బ‌ట్టి బ‌య‌ట‌కు గెంటేశాక‌.. త‌న అవ‌స‌రం మేర‌కే బీజేపీలో చేరుతున్నార‌నే సంగ‌తి వాళ్ల‌కు తెలియంది కాదు. అందుకే, మోదీ, అమిత్‌షా, న‌డ్డాలు కాకుండా.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో ప‌ని కానిచ్చేశారు. ప్ర‌స్తుతానికి ఈట‌ల ముఖం వెల‌వెల‌పోయినా.. ముందుముందు కాషాయ వ‌ర్ణంలో అస‌లు రంగులు బ‌య‌ట‌ప‌డ‌క మాన‌వు. వెయిట్ అండ్ సీ....