TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు.. పాక్ మధ్యవర్తిత్వంపై అనుమాన మేఘాలు

Published on: Thu Apr 23, 2026 12:42PM

హోర్ముజ్ కేంద్రంగా మారుతున్న   రాజకీయ చదరంగం కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి వంటి హోర్ముజ్ జలసంధిని కేంద్రంగా చేసుకుని ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఈ పరిస్థితికి కారణం పాకిస్థాన్ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్    అమెరికా,  ఇరాన్‌లను తప్పుదోవ పట్టిస్తోందనీ  అంటే డబుల్ క్రాస్ చేస్తోందనీ ఆరోపణలు వస్తున్నాయి.  హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో ఇరాన్ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ముందస్తు అనుమతి లేని నౌకలను వెనక్కి పంపడం లేదా నిలిపివేయడం వంటి చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. 

అయితే, ఈ క్రమంలో పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలకు మాత్రమే ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడంతో మధ్యవర్తిత్వం పేరుతో సొంత ప్రయోజనాల లావాదేవీలకు పాకిస్థాన్ ప్రాధాన్యత ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ చర్యలు ఇరాన్-అమెరికా మధ్య  దౌత్యపరమైన విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి ఈ వివాదాన్ని మరింత క్లిష్టం చేస్తోందంటున్నారు. హెచ్చరికలు, ఆంక్షలతో ఒత్తిడి పెంచి ఇరాన్‌ను ఒక ఒప్పందానికి తీసుకురావాలని ట్రంప్ చూస్తుంటే..  ఇరాన్   తన  అణు సామర్థ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

దీంతో  ఇరు దేశాల మధ్య   ప్రతిష్టంభన  నెలకొంది. ఈ పరిస్థితి  కేవలం ఆ ప్రాంతానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేందుకు దోహదం చేస్తోంది.  ప్రస్తుత తరుణంలో యుద్ధం కంటే దౌత్యమే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నప్పటికీ.. పాకిస్థాన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చర్చలు విఫలమైతే హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని..  అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్య సరఫరా గొలుసు దెబ్బతింటుందన్న ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. ఇస్లామాబాద్ నిజాయితీతో కూడిన మధ్యవర్తిత్వం వహించకపోతే..  రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే పెను ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. 

- సీతారాం కంఠంనేని