TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి పనులపై ప్రపంచ బ్యాంక్ ఏమందంటే?

Published on: Fri Oct 24, 2025 12:44PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగుతున్న పనులపై ప్రపంచ బ్యాంక్ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసల వర్షం కూడా కురిపించింది. అంతటితో ఆగకుండా   రెండో విడతగా అమరావతి నిర్మాణానికి 17వందల కోట్ల రూపాయల విడుదలకు పచ్చ జెండా ఊపింది.  ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ మూడు లేదా నాలుగోవారానికల్లా ఈ నిధులు ఏపీకి అందుతాయి.  ఈ నిధులతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయనడంలో సందేహం లేదు.  అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది మార్చిలో  తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది కూడా. ఆనిధుల్లో   50 శాతం మేర నిధులను ప్రభుత్వం వివిధ పనులకు వ్యయం చేయడం కూడా జరిగిపోయింది.

వరల్డ్ బ్యాంకు నిబంధనల మేరకు  తొలి విడత విడుదల చేసిన నిధుల్లో 75శాతం ఖర్చు చేసిన తరువాత మాత్రమే రెండో విడత నిధులు విడుదల అవుతాయి. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నిధులలో ఇప్పటి వరకూ 50 శాతం వ్యయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొలి వారం నాటికి మరో పాతిక శాతం నిధులను కూడా రాజధాని నిర్మాణం కోసం వ్యయం చేయనున్నట్లు చెప్పింది. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కూడా ఈ పనుల వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకే డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో రెండో విడత నిధులకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భావించవచ్చు.  అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్యారంటీతో వరల్డ్ బ్యాంకు నిధులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇస్తున్న నిధులు ఎలా వినియోగం అవుతున్నాయన్న విషయంపై ఆ బ్యాంకు ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే.  

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా  రూపొందుతోంది. అంటే అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. మొత్తం ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ఏడీబీ), కేంద్రం గ్రాంట్లతోనే నిర్మితమౌతోంది. ఇక ప్రపంచబ్యాంక్, ఏడీబీ రుణాల రూపంలో అందజేస్తున్న నిధులకు సంబంధించిన రీపేమెంట్ బాధ్యత అంతా కేంద్రానిదే.   దీంతో ఎవరెన్ని కుట్రలు పన్నిలా, అడ్డంకులు సృష్టించినా ఇక అమరావతి నిర్మాణ వేగం మందగించే అవకాశమే లేదని పరిశీలకులు అంటున్నారు.