ఒక్క ఘటన..  ఊరంతా క్వారంటైన్

కరోనా పేరు చెపితే చాలు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ప్రజల్లో ఈ కలవరానికి కారణం అది వ్యాప్తి చెందుతున్న తీరు. మార్చ్ లో మొదటి కేసు నమోదైన తెలంగాణ లో ప్రస్తుతం రోజు సుమారుగా వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తొలి రోజుల్లో నగరాలలో మొదలైన కరోనా కేసులు ప్రస్తుతం గ్రామాలను కూడా చుట్టుముడుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారారం లో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ యువకుడు చనిపోయిన తర్వాత పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఐంది. ఐతే మృతుడికి కరోనా ఉందన్న విషయం తెలియక ఆ గ్రామానికి చెందిన సుమారు 500 మంది అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల తర్వాత కరోనా టెస్ట్ రిజల్ట్ లో అతడికి కరోనా ఉన్నట్లు తేలడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న వైద్యాధికారులు ఆ యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారంతా హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దాదాపుగా గ్రామం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్ళింది.