ఈ విలువలు అప్పుడు గుర్తుకు రాలేదా :యనమల
Published on: Tue Jan 3, 2012 8:39AM
హైదరా
బాద్: "ఒక ఆంగ్ల పత్రిక తనపై వార్త రాసినప్పుడు తన వివరణ అడగలేదని...పత్రికా విలువలు దిగజారిపోయాయని జగన్ అంటున్నారు. తన పత్రిక, టీవీచానెల్‌లో ఇతర పార్టీలు, పత్రికలు, న్యాయ వ్యవస్థపై అడ్డగోలుగా రాసినప్పుడు ఎప్పుడైనా వారిని వివరణ అడిగారా? ఈ విలువలు అప్పుడు గుర్తుకు రాలేదా'' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిపై మండిపడ్డారు. ఆయన ఇతరుల గురించి రాసినప్పుడు మీడియా విలువలు గుర్తుకు రాలేదా అన్నారు. జగన్ అక్రమ సంపాదన, రాజకీయ వ్యవహార శైలి గురించి ఎవరు ప్రశ్నించినా వారిపై తన మీడియా సంస్థల ద్వారా దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.
కాగా తన రాజకీయాలపై వార్తాకథనం ప్రచురించిన ఓ ఆంగ్ల దినపత్రికకు జగన్ రెండు రోజుల క్రితం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి జగన్ రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచురించిన వార్తాకథనాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ బహిరంగ లేఖ రాశారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి పనిగట్టుకుని ఆ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఓ ఎల్లో సిండికేట్ తన బురద చల్లడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తోందని అంటూ ఆందులో మీరు కూడా చేరిపోయారా అని ఆయన ఆంగ్ల దిన పత్రికను ప్రశ్నించారు.


