TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా, ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్!

Published on: Thu Jun 18, 2026 10:02AM

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడింది.  అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం ఎంవోయూ కుదిరింది. ఈ ఓప్పందంపై బుధవారం (జూన్ 17) రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్   డిజిటల్ గా ఆమోదముద్ర వేశారు.  జీ7 విందు ముగించుకుని ఫ్రాన్స్‌లోని ప్రతిష్టాత్మక వర్సయ్స్ ప్యాలెస్ నుంచి ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వయంగా ధ్రువీకరిస్తూ..  సంతకం పూర్తయిందని ప్రకటించారు.  

 గత ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్ ఈ ఒప్పందంపై వర్చువల్ విధానంలో ప్రాథమికంగా సంతకాలు చేయగా, బుధవారం రాత్రి  ఇరు దేశాల అధినేతల తుది ఆమోద ముద్ర పడింది. మొత్తం 14 కీలక అంశాలతో  కూడిన ఈ తాత్కాలిక  ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఈ 60 రోజుల కాలంలో శాంతి స్థాపనకు అవసరమైన మరిన్ని శాశ్వత చర్యలను చేపట్టనున్నారు.

 యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద అడ్డంకిగా మారిన వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని  ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా తక్షణమే పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించింది.  దీనికి ప్రతిఫలంగా ఇరాన్‌పై విధించిన కఠినమైన ఆంక్షలను అమెరికా సడలించి.. వారి చమురు, ఇంధన ఎగుమతులకు  పూర్తి అనుమతి ఇవ్వనుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని, కొనుగోలు చేయబోమని ఈ ఒప్పందంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. 

అయితే, ఈ 60 రోజుల ఒప్పంద నిబంధనలను ఇరాన్ గనుక ఉల్లంఘిస్తే తిరిగి తీవ్ర సైనిక చర్యలు ఉంటాయని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఈ అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని శుక్రవారం (జూన్ 19)స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది.