TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోనేరు కీలక సూత్రధారి..సునీల్‌రెడ్డి కాజేసింది 96 కోట్లు

Published on: Sun Feb 12, 2012 9:05AM

హైదరాబాద్: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణంలో బిపి ఆచార్య ప్రధాన నిందితుడైనప్పటికీ స్టయిలిష్‌ హోం మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోనేరు ప్రసాద్‌ కీలక సూత్రధారి అని సిబిఐ సప్లమెంటరీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణకు సిబిఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి 96 కోట్లు కాజేశాడని సిబిఐ పేర్కొంది. ఒప్పందం ప్రకారం విల్లాలు, ప్లాట్ల విక్రయాల్లో ప్రభుత్వానికి చెందాల్సిన 26 శాతం వాటాను 5 శాతానికి తగ్గించిన ఘనత కూడా కోనేరుదేనని పేర్కొంది. గజం ధర 5 వేల రూపాయలకు విక్రయించినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపించి 40 నుంచి 50 వేల రూపాయలకు విక్రయించి 67 కోట్ల రూపాయలను కోనేరు అక్రమంగా కాజేశాడని సిబిఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఏడవ నిందితుడిగా ఉన్న సునీల్‌రెడ్డి 96 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని, కోనేరు ప్రసాద్‌ దుబారులో ఉండే తన కుమారుడు కోనేరు మధు ఖాతాలోకి కోటి రూపాయలు మళ్లించినట్లు సిబిఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. విల్లాల విక్రయాల్లో ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా బిపి ఆచార్య పట్టించుకోలేదని, ఈయన కూడా సంతోష్‌ కుమార్‌ త్రిపాఠి పేరులో విల్లా కొనుగోలు చేశారని పేర్కొంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కెవి రావుతో సిఫార్సు చేయించి విల్లా కొనుగోలు చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. అలాగే పారిశ్రామికవేత్తల కోసం విజయరాఘవన్‌ విల్లాలు కొనుగోలు చేసి పెట్టాడని తెలిపింది.

కాగా, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌లో అవకతవకలు, జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ దర్తాప్తు వేగవంతం చేసింది. వైఎస్‌ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారుల నుంచి, పలు బ్యాంకు ప్రతినిధులు, సిబ్బందిని పిలిచి సీబీఐ విచారించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్స్‌కు చెందిన ప్రతినిధులను సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆన్‌రాక్‌కు చెందిన మరో ప్రతినిధిని కూడా దిల్‌కుశాగెస్ట్‌హౌస్‌కు పిలిచి ప్రశ్నించింది. ఆయన నుంచి కూడా కొన్ని పత్రాలను సేకరించినట్లు సమాచారం.