TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిపి ఆచార్యకు కోర్టులో చుక్కెదురు

Published on: Fri Feb 10, 2012 8:24AM

హైదరాబాద్: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి బిపి ఆచార్యకు సిబిఐ న్యాయస్థానం బెయిలు నిరాకరించింది. ఎమ్మార్‌ కేసుపై విచారణ జరుగుతున్నందున ఆయనకు బెయిలు మంజూరు చేస్తే బయటికెళ్ళి సాక్షులను బెదిరించడం వంటి సంఘటనలకు పాల్పడుతారు కాబట్టి ఆచార్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిలు మంజూరు చేయరాదని సిబిఐ వాదించింది. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలంటూ ఇటీవల బిపి ఆచార్య న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టి వేసింది. ఎమ్మార్‌లో ఆచార్య మొదటి నిందితునిగా ఉన్నారు. ఆయన్ని ఈనెల ఒకటో తేదీన అరెస్టు చేసిన సమయంలో అస్వస్థతకుగురై నిమ్స్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అనంతరం ఆరోగ్యం కుదుటపడడంతో సిబిఐ అధికారులు మూడో తేదీన చంచల్‌గూడ జైలుకు తరలించిన కొద్దిసేపటికే మరోసారి ఛాతీలో నొప్పిరావడంతో ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో ఉన్నారు.


ఎమ్మార్‌ కేసులో నిందితుడు, స్టైలిష్‌ హోం మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోనేరు ప్రసాద్‌ బెయిలు పిటిషన్‌పై విచారణను సిబిఐ న్యాయస్థానం ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన రెండో నిందితుడు విజయసాయిరెడ్డి బెయిలు పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ వేగవంతంగా జరుగుతోందని, ఇంకా ఛార్జిషీట్‌ను దాఖలు చేయలేదు కాబట్టి విజయసాయిరెడ్డికి బెయిలు మంజూరుచేయరాదని సిబిఐ వాదించింది.