ఏపీలో ఎమర్జెన్సీ.. పల్నాడును వల్లకాడు చేస్తున్నారు.. బాబు
Published on: Sat Jun 4, 2022 12:12PM
హత్యా రాజకీయాలతో వైసీపీ ఏపీలో రక్త చరిత్ర రాస్తోంది. పల్నాడును వల్లకాడు చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నది. ప్రజాదరణ తగ్గిపోతున్నదన్న ఉక్రోషంతో విపక్ష తెలుగుదేశం క్యాడర్ ను భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
అదీ తెలుగుదేశంకు తొలి నుంచీ అండదండగా, వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం మండి పడుతోంది. వైసీపీ రక్త పింజరిలా మారి బీసీల ప్రాణాలకు హరిస్తోందని దుయ్యబడుతోంది. ముఖ్యంగా పల్నాడులో తెలుగుదేశంకు మద్దతుగా ఉన్న బీసీలను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండకు తెగబడుతోందని ఫైర్ అవుతోంది.
తెలుగుదేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా? అధికారం తలకెక్కిన వైసీపీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోయిందా? విపక్ష కార్యకర్తలపై దాడులు హత్యలూ చేసి వారి మృతదేహాలను ఎక్కడికి తరలించారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పకుండా భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారా అంటే విపక్ష నేత చంద్రబాబు ఔననే అంటున్నారు.
పల్నాడులో వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా తెలుగుదేశం నాయకులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడం అంటే రాష్ట్రంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. జల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన నడిరోడ్డుపైనే హత్యలు జరుపుతుంటే ఆపడం చాతకాని పోలీసులు అంత్యక్రియలకు వెళుతున్న వారిని అడ్డుకుని అరెస్టు చేయడమేమిటని నిలదీశారు. ఆఖరికి జల్లయ్య మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
స్వగ్రామంలో అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా కుటుంబ సభ్యులకు లేకుండా చేయడం దారుణాతి దారుణం కాక మరేమిటని చంద్రబాబు అన్నారు. హత్యలతో వైసీపీ, వారికి వంత పాడుతూ పోలీసులు పల్నాడును వల్లడాకు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. పల్నడు హత్యాకాండపై ప్రత్యేక కోర్టు పెట్టి వాచారించాలని డిమాండ్ చేశారు.


