TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న ఎల్ నినో

Published on: Wed Jun 3, 2026 9:49AM

ప్రపంచ దేశాలను  ఎల్ నినో బెంబేలెత్తిస్తున్నది. ఈ ఏడాది  ఎల్ నినో పభావం  ఊహించిన దానికంటే  భయంకరంగా,  బలంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) తాజాగా  హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా వేగంగా పెరుగుతున్నాయని.. ఇది రాబోయే  విపత్తుకు విస్పష్ట  సంకేతమని ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ  ఏజెన్సీ పేర్కొంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా  వాతావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

డబ్ల్యూఎంఓ విడుదల చేసిన తాజా గణాంకాలు,  అంచనాల  మేరకు ఈ జూన్  నుండి ఆగస్టు మధ్య కాలంలో  ఎల్ నినో   ఏర్పడేందుకు 80 శాతం   అవకాశాలు ఉన్నాయి.  అలాగే ఆ తరువాత  నవంబర్ నెల నాటికి  ఎల్ నినో    మరింత బలపడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రెండు నుండి ఏడేళ్లకోసారి వచ్చే ఈ సహజసిద్ధమైన వాతావరణ ప్రక్రియ, ఈసారి మానవ తప్పిదాల వల్ల పెరిగిన భూతాపంతో జతకట్టడం  ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త వర్షపాత సరళిని  తలకిందులు చేయనుంది.

ఈ   ఎల్ నినో ప్రభావం వల్ల భూగోళంపై కొన్ని ప్రాంతాలు తీవ్రమైన కరవు కాటకాలతో అల్లాడిపోతుంటే, మరికొన్ని ప్రాంతాలు అకాల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిపోయిన భూమికి,  రాబోయే ఎల్ నినో తోడైతే వాతావరణ మార్పుల తీవ్రత అనూహ్యంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఎల్ నినో ప్రభావంతో వచ్చే ఏడాది  చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా (హాటెస్ట్ ఇయర్ ఇన్ హిస్టరీ) రికార్డు సృష్టించే ప్రమాదం ఉందని డబ్ల్యూఎంఓ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.