చిత్తూరు జిల్లాలో ఏనుగుల ఆవేదన

 

మనుషుల్లో సెంటిమెంట్లు తగ్గిపోతున్నాయిగానీ, ఏనుగులలో మాత్రం సెంటిమెంట్ చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన చిత్తూరు జిల్లా రామాపురం తాండాలోని నక్కలగుట్ట వద్ద జరిగింది. ఇక్కడ కొంతమంది దుండగులు వన్యప్రాణులను సంహరించే ఉద్దేశంతో కరెంటు తీగలు అమర్చారు. అవి తగిలి ఒక ఏనుగు అక్కడికక్కడే మరణించింది. తమ మందలో వుండాల్సిన ఏనుగు కనిపించకపోవడాన్ని గమనించిన మందలోని మిగతా 12 ఏనుగులు తమ సహచర ఏనుగును వెతుక్కుంటూ నక్కలగుట్ట దగ్గరకి వచ్చాయి. అక్కడ ఏనుగు చనిపోయి వుండటం గమనించి ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. బాధగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఈ ఏనుగుల ఆవేదన ఆగ్రహంగా మారి గ్రామాల మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో అని చుట్టుపక్కల గ్రామస్థులు భయపడుతున్నారు. గత కొంతకాలంగా చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు అడవుల్లోంచి బయటకి వచ్చి ఊళ్ళ మీద పడుతున్నాయి. పొలాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఏనుగు మరణించడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామం ఏర్పడుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ఈ ఏనుగులను శాంతపరిచి అడవిలోకి ఎలా పంపాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు.