మలయాళం అర్ధంకాక విధ్వంసం సృష్టించిన ఏనుగు

 

పాపులర్ అవ్వటానికి ఈ మధ్య కాలంలో జనాలు వేస్తున్న వెర్రి వేషాలు అన్నీ ఇన్ని కావు. కొత్తగా,వింతగా ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళకంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్న వల్లే ఎక్కువ. కేరళలో కూడా ఓ మహానుభావుడు కొత్తగా ట్రై చేసి తన ఆర్భాటాన్ని ప్రదర్శిద్దామనుకొని ఓ వ్యక్తి చావుకు కారణం అయ్యాడు. సాధారణంగా గృహప్రవేశానికి గోవును తీసుకొస్తారు. కానీ ఈ ప్రబుద్దుడు ఏకకంగా ఏనుగును తీసొచ్చాడు. ఆ ఏనుగుకేమో మలయాళం రాదు. మావటి వాడు చెప్పేది అర్థంకాక విధ్వంసం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే....కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ కొత్తపదిలో షైజు అనే వ్యాపారి తన కుటుంబంతో నివాసముంటున్నారు. షైజు తన కుటుంబం కోసం కొత్తగా ఇల్లు నిర్మించి బంధువులు, స్నేహితులను పిలిచి గృహప్రవేశ మహోత్సవం ఏర్పాటు చేశారు.

గృహప్రవేశం సందర్భంగా గోమాతను తీసుకురావడం సర్వ సాధారణమని, తాను ఘనంగా ఉండేలా గురువాయూర్ లోని దేవాలయం నుంచి 54 ఏళ్ల వయసు గల రామచంద్రన్ అనే పేరుగల ఏనుగును తీసుకువచ్చారు. ఆ ఏనుగు సమక్షంలో అత్యంత వైభవోపేతంగా గృహప్రవేశ మహోత్సవం జరుగుతుండగా,అంతలో పక్కింట్లో ఉన్న ఒకరు బాణసంచాను కాల్చారు. బాణసంచా కాల్చిన శబ్దానికి బెదిరిన ఏనుగు కాస్తా వేడుకకు వచ్చిన అతిధులపైకి దూసుకువచ్చింది. అంతే గృహప్రవేశానికి వచ్చిన అతిధి నారాయణ పెట్టేరి (66) ఏనుగు తొక్కిసలాటలో అక్కడికక్కడే మరణించాడు. మరో అతిధి మరుగన్ (60) తీవ్ర గాయాలతో కున్నంకులం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఏడుగురు అతిధులు గాయపడ్డారు. మొత్తంమీద ఏనుగు విధ్వంసంతో వేడుకగా సాగాల్సిన గృహప్రవేశ మహోత్సవం కాస్తా విషాద వేదికగా మారింది. కాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ ఏనుగును 1982లో కేరళకు తీసుకువచ్చారని, ఈ ఏనుగుకు మావటి మళయాళం భాషలో ఇచ్చే ఆదేశాలు అర్థం కాక ఇలా విధ్వంసానికి దిగుతుందని స్థానికులు చెప్తున్నారు. బహిరంగంగా ఏనుగులను ఊరేగింపులకు వినియోగించరాదని కేరళ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ తీర్పును ఉల్లగింస్తూనే ఉన్నారు.