TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల‌క్ట్రిక్ బైక్ కొన్న మ‌ర్నాడే పేలుడు.. ఒక‌రు మృతి, ముగ్గురికి తీవ్ర‌గాయాలు..

Published on: Sat Apr 23, 2022 11:25AM

ఇప్పుడంతా ఎల‌క్ట్రిక‌ల్ బైక్ జ‌మానా. పెట్రోల్‌, డీజిల్ రేట్లు అమాంతం పెర‌గ‌డంతో మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గ‌మంతా బ్యాట‌రీ బైక్స్ కొంటున్నారు. ర‌క‌ర‌కాల మోడ‌ల్స్‌.. ర‌క‌ర‌కాల బ్రాండ్స్ అందుబాటులో ఉండ‌టం.. ధ‌ర కూడా మ‌ధ్య‌స్థంగా ఉండ‌టం.. డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గొడ‌వ లేక‌పోవ‌డంతో.. చార్జింగ్ స్కూట‌ర్స్‌కు డిమాండ్ పెరిగింది. ఓలా లాంటి కంపెనీలు సైతం రంగంలోకి దిగ‌డంతో ఎల‌క్ట్రిక‌ల్ బైక్స్‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఇదే ఛాన్స్ అనుకొని.. ఊరూపేరు లేని సంస్థ‌లు సైతం బ్యాట‌రీ బైక్స్ త‌యారు చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అయితే, వ‌రుస‌గా జ‌రుగుతున్న కొన్ని ఘ‌ట‌న‌లు ఎల‌క్ట్రిక్ బైక్ అంటేనే ద‌డ పుట్టేలా చేస్తున్నాయి. ఎండాకాలం ప్ర‌భావ‌మో.. లేక‌, నాసిర‌కం త‌యారీ విధాన‌మో.. కార‌ణం ఏదైనా ఈమ‌ధ్య ఎల‌క్ట్రిక్ బైకులు పేలిపోతున్నాయి. మంట‌ల‌తో త‌గ‌ల‌బ‌డుతున్నాయి. తాజాగా, విజ‌య‌వాడ‌లో ఓ చార్జింగ్ పెడుతుండ‌గా.. ఓ బైక్ పేలి ఒక‌రి ప్రాణాలు పోవ‌డం, ముగ్గురికి తీవ్రగాయాలు కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. 

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సూర్యారావుపేట ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. స్థానిక గులాబీపేటలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి.. బైక్ ఓన‌ర్ చ‌నిపోయారు. ఈ పేలుడుతో భారీగా మంట‌లు చెల‌రేగి అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. 

శుక్ర‌వార‌మే శివకుమార్‌ కొత్త బైక్ కొన్నాడు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులతో ఇరుగు పొరుగు వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. శివకుమార్‌ మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. 

విజయవాడ ఎపిసోడ్ గురించి తెలిసి ఎలక్ట్రిక్ బైక్స్ కొన్న వారంతా హడలిపోతున్నారు. ఛార్జింగ్ పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఎండలో బండి పార్క్ చేయాలన్నా టెన్షన్ పడుతున్నారు. ఇటీవల ఓలా స్కూటర్ సైతం ఎండలో కాలిపోవడంతో కలవర పడుతున్నారు. ఎందుకైనా మంచిది... బీకేర్‌ఫుల్ విత్ ఎల‌క్ట్రిక‌ల్ బైక్స్‌.