మన దేశానికి రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి కావాలా?
Published on: Fri May 4, 2012 10:05AM
దేశ 13వ రాష్ట్రపతి పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. జులై 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం వున్న రాజకీయ వాతావరణంలో అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నిక అవుతారా? అనే సందేహం నెలకొని వుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కాంగ్రెస్, బిజెపి కూటములు తమతో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎ.కె. ఆంటోని చెన్నై వచ్చి యు.పి.ఎ.-2 ప్రభుత్వంలో భాగస్వామి అయిన డి.ఎం.కె. నేత కరుణానిధితో సంప్రదింపులు జరిపి వెళ్ళారు. వీరిమధ్య చర్చల సారాంశం వెల్లడి కాకపోయినప్పటికీ ఇరుపక్షాలు ఒకే అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశాలే వున్నాయి. రాష్ట్రపతి పదవి ప్రధానమంత్రి లేదా ఇతర రాజకీయ పదవుల వలె క్రియాశీలకమైనది కాకపోయినప్పటికీ అత్యున్నతమైన పదవి. రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రపతి బాధ్యత, త్రివిధదళాల అధిపతి కూడా రాష్ట్రపతే. పార్లమెంటు చేసే చట్టాలకు ఆమోదం తెలియచేయడమే కాక అవసరమైతే చట్టాలను మరోసారి సమీక్షించాలని తిరస్కరించే పనిని కూడా రాష్ట్రపతి చేస్తారు. అందువల్ల రాజ్యాంగపరమైన అంశాలో లోతైన అవగాహనతో పాటు రాజకీయపరమైన మతలబులు, మెళకువలు తెలిసివుంటే సంక్షోభ సమయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగం, రాజనీతిజ్ఞత, మచ్చలేని కుటుంబ నేపథ్యం వున్న పరిపాలనా దక్షులను మాత్రమే ఎన్నుకొన్న సందర్భాలు వున్నాయి.
ఇందిరాగాంధీ చెబితే చీపురు పట్టుకొని వీథిని శుభ్రం చేస్తానని రాష్ట్రపతిగా పనిచేసిన జ్ఞానీజైల్ సింగ్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ కు రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి అనే పరు ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి గుణాలు గల వ్యక్తినే రాష్ట్రపతిగా నియమించడానికి ప్రయత్నిస్తున్నడన్న వార్తలు వస్తున్నాయి.
మనకిప్పుడు ఫకృద్దీన్ ఆలీ అహ్మద్, జ్ఞానీజైల్ సింగ్ లాంటి వ్యక్తులకు కొదవలేదు. ఇలాంటివారు రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకురారు. మనకు కావలసింది ఇప్పుడు కె.ఆర్. నారాయణ్ లాంటి వ్యక్తులు రాష్ట్రపతిగా ఎన్నికకావాలి. ఎందుకంటే ఐ.కె. గుజ్రాల్ ప్రధానమంత్రిగా వున్న సమయంలో ఉత్తరప్రదేశ్, ఎన్.డి.ఎ. ప్రబుత్వహయాంలో బీహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా అందుకు నారాయణ్ తిరస్కరించారు. రాష్ట్రపతి పాలనకు అవసరమైన పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో లేవని నారాయణ్ సాధికారికంగా వివరించి, తిరస్కరించగలిగారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన నేతలు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అవసరం.


