సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు

 

ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం జనవరి 1వ తేదీనాటికి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని చెపుతూ తెలంగాణా ప్రజలని మభ్యపెడుతోంది. కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తే అసలు ఎన్నికలలోగా తెలంగాణా బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందా లేదా? అనే అనుమానం కూడా కలుగుతోంది.

 

మరో తాజా కబురు ఏమిటంటే ఒకవేళ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ, ఆ తరువాత జరుగవలసిన అధికారిక ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం నెల రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందితే, దానిపై నోటిఫికేషన్ వెలువడడానికి కనీసం నెల రోజులు, ఆతరువాత దానిపై రాష్ట్రపతి అధికార ముద్ర వేసి రాష్ట్రావతరణను ప్రకటించడానికి మరొక నెలరోజులు పైగా పట్టవచ్చని హోంశాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి. అందువలన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుకి ఆమోదం తెలిపినప్పటికీ, ఈ ప్రక్రియ అంతా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ (మార్చి రెండవ తేదీలోగా) వెలువడేలోగా పూర్తికావడం అసంభవం, గనుక 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరపవలసి ఉంటుందని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.