తెలంగాణా ఎన్నికల చిత్రం

 

రానున్న ఎన్నికలు ఒక అనూహ్యమయిన వాతావరణంలో జరగనున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ, తెరాస కాంగ్రెస్ తో విలీనం లేదా పొత్తులకి అయిష్టత చూపుతున్న కారణంగా తెరాస, కాంగ్రెస్, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుంది. ఈ పోటీలో తెరాసదే పై చేయిగా ఉండవచ్చు. ఈ ఎన్నికల తరువాత మొట్ట మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న కారణంగా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. అది సహజంగానే తెరాసకు లబ్ది చేకూరిస్తే, మిగిలిన అన్ని పార్టీలకు అడ్డుగోడగా నిలుస్తుంది.

 

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తున్నపటికీ, కేసీఆర్ ని డ్డీకొని ఎదురు నిలువగల నాయకుడు, ఆయనంత ప్రజాకర్షక నేతలెవరూ ఆ పార్టీలో లేకపోవడమే ఆపార్టీకి ప్రధాన బలహీనత అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం జైపాల్ రెడ్డిని ముందుకు తీసుకు వచ్చినప్పటికీ, కేసీఆర్ నోటిజోరు ముందు ఆయన కూడా తీసికట్టే!

 

ఇక తెదేపాకు తెలంగాణాలో బలమయిన క్యాడర్, బలమయిన నాయకులు ఉన్నపటికీ, ఆపార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి కారణంగా రెండు లేదా మూడు స్థానాలకే పరిమితమవవచ్చును. ఒకవేళ మజ్లిస్ పార్టీతో లేదా బీజేపీతో చేతులు కలిపితే పరిస్థితి మరికొంత మెరుగుపడవచ్చును.

 

ఇక ఈసారి మోడీ ప్రభావం ఈ ఎన్నికలపై చాలానే ఉండవచ్చును. అయితే అది ఆపార్టీ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మాత్రం కాదని చెప్పవచ్చును. ఒకవేళ బీజేపీ తెరాసతో పొత్తులు పెట్టుకొంటే మరికొన్ని సీట్లు అదనంగా గెలవగలదు.