TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త కేంద్ర రక్షణ మంత్రిగా మళ్లీ ఆయనే..?

Published on: Mon Mar 13, 2017 4:40PM

 

గోవాలో బీజేపీ అధికారం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు పారికర్ స్థానంలో ఎవరు రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అరుణ్ జైట్లీయే రక్షణ మంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత తనకు పనిభారం ఎక్కువైందని, ఏదో ఒక శాఖ తీసేయాలని జైట్లీ కోరడంతో.. పారికర్‌ను గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి మరీ తీసుకొచ్చారు.

 

అయితే ఇప్పుడు గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా పారికర్ నే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాలనే గెలిచిన బీజేపీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఎత్తులు వేసిన నేపథ్యంలో ఇతర పార్టీ నేతలు పారికర్ సీఎంగా వస్తానంటేనే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్దమని తెలిపాయి.  ఈ నేపథ్యంలో గోవా సీఎంగా పారికర్ ను పార్టీ ఫిక్స్ చేసింది. దీంతో ప్రస్తుత పదవికి రాజీనామా చేసి పారికర్ మళ్లీ తన సొంత రాష్ట్రానికే వెళ్లనున్నారు.