ఈసీలో బయటపడ్డ లుకలుకలు.. పక్షపాత ధోరణి నిజమే!!

 

దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినా ఈసీపై ఈ స్థాయిలో విమర్శలు ఎప్పుడూ రాలేదు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ వరకు చాలా పార్టీలు ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈసీ తీరుపై సాక్ష్యాత్తూ సభ్యులే అసంతృప్తితో ఉండడం చర్చనీయాంశమైంది. స్వయంప్రతిపత్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అంటూ ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అశోక్ లవాసా ఆరోపిస్తున్నారు.

ప్రచార సభల్లో నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే అశోక్ లవాసా ఆరోపణలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిన అంశంలో ఈసీ క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈవిషయమై ఆయన మే4న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌  అరోరాకు లేఖ కూడా రాశారు. క్లీన్‌ చిట్‌ ఇచ్చే సమయంలో తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం దక్కడం లేదని అశోక్‌ ఆరోపించారు. ఈసీ ఆదేశాల్లో మైనారిటీ నిర్ణయాలనూ జత చేయాలని లేఖలో పేర్కొన్నారు.

లేఖ రాసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులను ఈసీ సీరియస్‌గా తీసుకోలేదని, ఈ విషయంపై ఆయన మనస్తాపం చెందారని అశోక్‌ సన్నిహితులు మీడియాకు తెలిపారు.  అరోరా, మరో సభ్యుడు సుశీల్‌ చంద్ర తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలతో ఆయన బలవంతంగా సమావేశాలకు దూరంగా ఉండాల్సివస్తోందని వారు తెలిపారు. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మీద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అభ్యర్థులను వారించడం వంటివి కూడా ఈసీ చేయలేదని సన్నిహితుల ముందు అశోక్‌ వాపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అశోక్‌..  అరోరాకు ఎన్ని సందేశాలు పంపినా వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదని, దీంతో మనస్తాపం చెంది అశోక్‌ ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం.

అశోక్‌ అసంతృప్తితో ఎన్నికల సంఘం ఇరుకున పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అంతర్గత కలహాలు తలెత్తగా ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.