TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఉప ఎన్నిక సందడి.. జగన్ మదిలో ఉన్నది ఎవరు?

Published on: Wed Jan 6, 2021 1:37PM

ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 11న నోటిఫికేషన్ విడుదలకానుంది. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించనున్నారు. 

 

కాగా, పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి 2023 వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పార్టీల బలాలు చూస్తే ఈ ఎమ్మెల్సీ స్థానం వైసీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పదవి కోసం వైసీపీలో ఆశావహులు పోటీపడుతున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పోతుల సునీతకే మళ్లీ జగన్ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని నెలల క్రితం చనిపోయిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జగన్ ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశముందని అంటున్నారు. మరోవైపు, ఇటీవల మరణించిన చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా భగీరథరెడ్డికి కూడా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. మరి జగన్ వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారో లేక మరో కొత్త పేరును ఖరారు చేస్తారో చూడాలి.