పన్నీర్ కి 'విద్యుత్ స్థంభం' షాకిచ్చి.. శశికళకి 'టోపీ' పెట్టిన ఈసీ!


జయలలిత మరణంతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమైంది. మెల్లమెల్లగా ఇప్పుడే సద్దుకుంటోంది. కాని, జయలలిత సారథ్య వహించిన అన్నాడీఎంకే మాత్రం ఇంకా స్థిమితపడటం లేదు. ఒకవైపు అమ్మ తరువాత చిన్నమ్మ అనుకున్న వారికి ఆమె జైలుకి వెళ్లటం షాకైతే... పన్నీర్ సెల్వం అమ్మ ఆశీస్సులు అందుకున్న అసలు సిసిలు సీఎం అనుకున్న వారికీ విభ్రాంతే మిగిలింది. అసెంబ్లీలో ఆయనకు హ్యాండిచ్చారు మెజార్జీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు! అయితే, చెన్నైలో ముగిసిన పోరు ఢిల్లీ ఎలక్షన్ కమీషన్ ముందు ఇంకా కొనసాగుతూనే వుంది!

 

అన్నాడీఎంకేకి మొదట్నుంచీ ఎన్నికల గుర్తుగా వుంటోంది రెండాకుల సింబల్! ఆ రెండాకుల మాదిరిగానే పార్టీలో ఎప్పుడూ ఎవరో ఇద్దరూ రాజ్యమేలుతుంటారు. మొదట్లో ఎంజీఆర్, జయలలిత ప్రతాపం నడిచేది. తరువాత ఎంజీఆర్ చనిపోయాక జయకి, ఆయన భార్య జానకీ రామచంద్రన్ నికి మధ్య గొడవ జరిగింది. అప్పుడు కూడా రెండాకుల బొమ్మ కీలకమై కూర్చుంది. అయితే, తరువాతి కాలంలో ఎలాగో తన పట్టు బిగించిన జయలలిత పార్టీలో తిరుగులేని నేత అయ్యారు. కాని, ఆమె జీవితంలోకి చాప కింద నీరులా వచ్చిన శశికళ... మరోసారి పార్టీలో రెండో ఆకుగా మారిపోయారు! డిసెంబర్ 5న జయ మరణం వరకూ అమ్మ, చిన్నమ్మలే అన్నాడీఎంకే రెండు ఆకులు!

 

జయలలిత మరణం తరువాత గత కొన్ని నెలల్లో జరిగిన రాద్ధాంతం మనకు తెలిసిందే. సెక్రటేరియట్ కు వెళదామనుకున్న చిన్నమ్మను పన్నీర్ సెల్వం అడ్డుకుని మరీ జైలుకి వెళ్లేదాకా వ్యవహారం లాక్కొచ్చాడు. భీకరమైన మూడు దెబ్బల శపథం తరువాత శశి బెంగగా బెంగళూరు వెళ్లిపోయింది. అలా దశాబ్దాల పాటూ పార్టీకి రెండు ఆకుల్లా వుంటూ వచ్చిన అమ్మ, చిన్నమ్మ ఇద్దరూ ఇప్పుడు ఏఐఏడీఎంకేకి లేకుండా పోయారు. అయితే, రాబోయే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల సింబలే కనిపించకుండా పోనుంది.

 

జయలలిత నియోజక వర్గమైన ఆర్కే నగర్ లో ఏప్రెల్ నెలలో ఎలక్షన్ జరగనుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారో చూస్తే మనకు తమిళ ప్రజల మూడ్ తెలిసిపోతుంది. ఒకవైపు పన్నీర్ సెల్వం తనకు అమ్మ అనుగ్రహం వుందంటూ పోరాటం చేశాడు. ఇంకో వైపు అమ్మకు వారసురాలు చిన్నమ్మే అంటూ ఎమ్మెల్యేలంతా పళనిస్వామివైపు నిలిచారు. ఇక ఇప్పుడు జయలలిత మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానంలో జనం ఎవర్ని కూర్చోబెడతారో చూడాలి. దాంతో పళనీ స్వామి వర్గం నిజమైన జయ వారసులా? లేక శశికళ వర్గమే అమ్మకు వారసులా తెలిసిపోతుంది! అందుకే, ఈసీ రెండు వర్గాలుగా చీలిన రెండాకుల పార్టీ వారికి ... ఎవ్వరికీ రెండాకుల గుర్తును ఇవ్వలేదు. పన్నీర్ సెల్వం సమర్థిస్తున్న మధుసూధనన్ కు ఎలక్ట్రిక్ పోల్ గుర్తు కేటాయించింది. శశికళ బృందం బరిలో నిలుపుతున్న దినకరన్ కు టోపీ గుర్తునిచ్చింది! అలాగే, వీళ్ల పార్టీల పేర్లు అన్నాడీఎంకే పురుచ్చి తలైవీ అనీ, అన్నాడీఎంకే అమ్మఅని వుండబోతున్నాయి రాబోయే బైపోల్స్ లో!

 

కొత్త పేర్లు, కొత్త సింబల్స్ తో బరిలోకి దిగబోతున్న పన్నీర్ సెల్వం, శశికళ బ్యాచ్ లు కేవలం ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోబోవటం లేదు. జయలలిత వారసత్వానికి సంకేతమైన రెండాకులు కూడా ఆర్కే నగర్ బైపోల్స్ లో గెలిచిన వారి వశమే అయ్యే అవకాశం వుంది! మొత్తానికి అంతర్గత పోరుతో బజారున పడ్డ అన్నాడీఎంకే నాయకుల్లో ఎవ్వరికీ ఇప్పటికిప్పుడు రెండాకులు ఇవ్వకుండా... ఎలక్షన్ కమీషన్ తాను రెండాకులు ఎక్కువే చదివిందని తేల్చేసింది! చూడాలి మరి... ఏప్రెల్ వార్ లో ఆర్కే నగర్ జనం... విద్యుత్ స్థంభం గుర్తున్న పన్నీర్ కి షాకిస్తారో... లేక టోపీ గుర్తున్న శశికళకి టోపీ పెడతారో... వెయిట్ అండ్ సీ!