పక్కా ఎన్నికల కోడ్ తో జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ షాక్..  

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు గవర్నర్ బిశ్వభూషన్ ప్రయత్నాలను ప్రారంభించారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తోనూ, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తోనూ గవర్నర్ రాజ్ భవన్ లో విడివిడిగా సమావేశమై చర్చించారు. ఎన్నికల నిర్వహణ అంశంలో ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని అయన కొన్ని సూచలను చేశారు.

 

ఇది ఇలా ఉండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయడం నిలిపివేయాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నవరత్నాలు పథకంలో భాగంగా ప్రభుత్వం వాడుతున్న లోగోకు బదులుగా, వేరే లోగోను వాడాలని అయన సూచించారు. మరోపక్క గ్రామాలలో సర్వం తామే అయి హవా నడిపిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకోవాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.

 

గొడవలు, అసాంఘిక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు కూడ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావొచ్చని ఆయన పేర్కొన్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైతే ప్లాన్ బీ ని కూడ అమలు చేస్తామన్నారు. ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బలగాలను ఉపయోగించడమే ప్లాన్ బీ అని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొద్ది ప్రాంతాన్నే రికార్డు చేస్తోందని ఆయన చెప్పారు. వెబ్ కాస్టింగ్ లో పూర్తిస్థాయి నాణ్యత లేదన్నారు. వెబ్ కాస్టింగ్ పరిధి అవతల జరిగే సంఘటనల మాటేంటని ఆయన ప్రశ్నించారు.